ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా బాలయ్య తీరును కడిగిపారేస్తున్నారు.
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య వ్యవహరించిన తీరును తప్పుబడుతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణతో పాటు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీమ్ మొత్తం స్టేజ్ మీద ఉన్న సమయంలో తన పక్కనే ఉన్న హీరోయిన్ అంజలిని కొంచెం పక్కకి జరగమని బాలయ్య చెప్పారు. ఆమె కొంచెమే జరగడంతో ఏమైందో ఏమో కానీ ఒకేసారి అంజలిని పక్కకి నెట్టేశారు బాలయ్య. ఈ సడెన్ షాక్‌కి అంజలి కాస్త వెనక్కి తూలింది. అంజలి కాస్త తడబడినా బాలయ్య చర్యను స్పోర్టివ్ గా తీసుకుంది. నవ్వుతూనే ఫొటోలకు పోజులిచ్చింది. ఆమె పక్కన నిలబడిన నేహాశెట్టి మాత్రం కాస్త అవాక్కయినట్లుగా కనిపించింది. ఆ సమయంలో బాలకృష్ణ ఆమెతో ఏం మాట్లాడారో తెలియనప్పటికీ అంజలి మాత్రం నవ్వుతూనే ప్రతిస్పందించింది. కానీ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా బాలయ్య తీరును కడిగిపారేస్తున్నారు. బాలకృష్ణ ప్రవర్తన మహిళలను అగౌరవపరిచేదిగా ఉందని విమర్శిస్తున్నారు. "బాలయ్య మరీ ఇంత వైలెంట్‌గా ఉంటే ఎలాగయ్యా, బాలయ్యతో కష్టమే" అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. మరి కొంతమంది అయితే పాపం అంజలి ఏం అనలేక నవ్వలేక నవ్వుతూ కవర్ చేసింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మరొకరు ‘బాలకృష్ణ ప్రవర్తన దారుణం. ఆ పరిస్థితుల్లో ఓ జూనియర్ నటి నవ్వుతూ ప్రతిస్పందించడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ఇంత దాడి జరిగినా దాన్ని సమ్మతిస్తున్నట్లుగా అరుపులు, కేకలతో ప్రేక్షకులు స్పందించడం అత్యంత భయానకం’ అని కామెంట్ చేశాడు. మరో నెటిజన్ స్పందిస్తూ ‘అతిగా ఊహించుకుంటూ ఓవర్ యాక్షన్ చేసే నటుడు. ఆయన ఏ సినిమాలోనూ బాగోడు’ అని మరో యూజర్ మండిపడ్డాడు.
అయితే దీనికి అంజలి నుంచి సమాధానం వచ్చింది. బాలయ్య పై అంజలి లేటెస్ట్ గా ఓ పోస్ట్ పెట్టి తమ మధ్య ఎలాంటి బాండ్ ఉంటుందో తెలిపుతూ వీడియో రిలీజ్ చేసింది. తాము ఇద్దరం ఎపుడు ఎంతో స్నేహంగానే ఉంటామని మేమిద్దరం కూడా ఎప్పుడూ ఒకరు పట్ల మరొకరు గౌరవం ఇచ్చిపుచ్చుకునే వాళ్ళం అని తెలిపి ఈవెంట్ లో వారి మధ్య కొన్ని మూమెంట్స్ ని వీడియో రూపంగా పెట్టింది. ఇందులో బాలయ్య ఆమెతో నవ్వుతూ మాట్లాడిన సందర్భాలూ ఉన్నాయి అలాగే ఆమెని తోసిన క్లిప్ కూడా ఉంది. మొత్తానికి బాలయ్య విషయంలో అంజలినే ఎలాంటి సమస్య లేదని చెప్పి చెక్ చెప్పే ప్రయత్నం చేసింది.
అయితే దీనికి స్పందనలు వస్తున్నాయి. ఇండస్ట్రీలో ఇబ్బంది లేకుండా వీడియో విడుదల చేసిందని ఒకరు..‘50కిపైగా సినిమాల్లో ఆమె నటించింది. అందులో దాదాపు సగం సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. సినీ పరిశ్రమలో ఇలాంటి పరిస్థితి నెలకొనడం బాధాకరం. దీన్ని ఎవరూ మార్చలేకపోవడం మరింతగా బాధిస్తోంది. ఈ వ్యవహారాన్ని తిమ్మిని బమ్మిని చేసేందుకు ‘పీఆర్’ రంగంలోకి దిగినా ఆశ్చర్యపోను’ అంటూ మరొకరు వ్యాఖ్యానించారు. కాగా, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ శుక్రవారం విడుదల కానుంది.
