కరోనా మహమ్మారి గురించి సోషల్‌మీడియాలో కుప్పలుతెప్పలుగా పోస్టులు వచ్చిపడుతున్న సంగతి తెలిసిందే. దేశంలో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్న వేళ పోస్టులు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి.  తోటి వారికి అవగాహన కల్పించేందుకు ఇలా పోస్టులు పెట్టడం మంచిదే అయినా అవగాహన మాటున కొందరు ఫేక్‌ న్యూస్‌ను ప్రచారం చేస్తుండడం విచారకరం! ముఖ్యంగా ఫలానా సెలబ్రెటీకి కరోనా వచ్చిందంటూ రోజుకో ప్రచారం మొదలవుతోంది. దాంతో వారు ఖండన ఇవ్వాల్సి వస్తోంది.

ఇప్పటికే కత్తి మహేష్, రామ్ గోపాల్ వర్మ వంటి వారు తమపై వచ్చిన ఆరోపణలను తిప్పి కొడుతూ ప్రకటన చేసారు. తాజాగా యాంకర్ ఝాన్సీ సైతం ..ఈ ఫేక్ న్యూస్ బారిన పడింది. ఆమె కూడా ఖండన ఇవ్వాల్సి వచ్చింది. రీసెంట్ గా సినీ, టీవీ ప‌రిశ్ర‌మ‌ల్లోనూ కొందరికి క‌రోనా సోకిన విషయం తెలిసిందే. అయితే, ఇదే అదునుగా చూసుకుని కరోనా సోకని వారికి కూడా సోకిందంటూ నకిలీ వార్తలు ప్రచారం అవుతున్నాయి. యాంకర్ ఝాన్సీకి క‌రోనా సోకిందని ఇటీవల ప్రచారం జరిగింది.

తాను హోస్ట్‌గా ఉన్న పరివార్ సీజన్ 2 కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యంలో కరోనా ఉన్న వారితో కలిసి పని చేయడం వల్ల ఆమెకు కూడా వైరస్‌ సోకిందని వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె స్పందించి స్పష్టతనిచ్చారు. తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని, అసత్య వార్తలు నమ్మి తనకు ఫోన్లు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. తన ఆరోగ్యం గురించి ఆరా తీసిన వా‌రికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. కాగా, షూటింగుల్లో పాల్గొంటోన్న వారు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.