అర్జున్ రెడ్డి చిత్రం, దర్శకుడు సందీప్ వంగ విషయంలో తాను గతంలోనే అభ్యంతరం వ్యక్తం చేశానని అంటోంది అనసూయ. అర్జున్ రెడ్డి రిలీజ్ తర్వాత అనసూయ చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగింది. ఇటీవల సందీప్ వంగ ఓ ఇంటర్వ్యూలో ప్రేమ గురించి చేసిన వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

ఓ మహిళతో ప్రేమలో ఉన్నప్పుడు ఆమెపై చేయి చేసుకునే స్వేచ్ఛ ఉండాలి. అలా లేనప్పుడు అక్కడ ప్రేమ ఉంటుందని నేననుకోను. నా సినిమాపై విమర్శలు చేసిన మహిళా క్రిటిక్ ని బహుశా ఎవరూ ప్రేమించలేదేమో అంటూ సందీప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యపై గాయని చిన్మయి, సమంత లాంటి ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 

తాజాగా అనసూయ ఈ వివాదంపై స్పందించింది. చిన్మయి చాలా శక్తివంతమైన మహిళ. నేను గతంలో సందీప్ మహిళలపై కామెంట్స్ చేసినప్పుడు ఖండించాను. మీరెవ్వరూ నాకు సపోర్ట్ చేయకపోవడంతో చాలా నిరాశ చెందా. కానీ ఇప్పుడు మీరు అతడిని వ్యాఖ్యలని వ్యతిరేకించడం మంచి పరిణామం అని అనసూయ ట్వీట్ చేసింది.