ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతం నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలను చెప్పట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలాంటి అభ్యంతరాలు చెప్పకపోవడంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే పర్యావరణవేత్తలు ఈ నిర్ణయంపై 
ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నల్లమల అడవుల్లో యురేనియంను వెలికి తీసి దాంతో అణువిద్యుత్‌ను తయారుచేయడానికి ఈ తవ్వకాలు చేపట్టాలని ప్రభుత్వాలు చూస్తున్నాయి. ఈ ప్రభావం రెండు రాష్ట్రాల ప్రజల మీద, పర్యావరణం మీద పడే అవకాశాలు ఉండడంతో దీన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ నుండి కూడా కొందరు నటులు ఈ చర్యను వ్యతిరేకిస్తున్నారు.

ఇప్పటికే విజయ్ దేవరకొండ యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తాజాగా అనసూయ కూడా ఈ చర్యను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

''ఇప్పుడే సెల్ఫ్ ఎడ్యుకేట్ చేసుకున్నా.. యురేనియం ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి కావాలంట. సో, నేచురల్‌గా పీల్చే స్వచ్ఛమైన గాలిని ప్రసాదించే చెట్లను చంపి.. ఎలక్ట్రిక్ పరికరాల ద్వారా రానున్న రోజుల్లో కొనుక్కునే వాళ్లకే పీల్చడానికి గాలి లేకపోతే ఊపిరి ఆడక చావు.. అంతేగా??. ఇదేగా మన భవిష్యత్తు?? ఎలా అనుమతిస్తున్నారు సార్ ఇదంతా?? ఆలోచించడానికే భయం వేయలేదా?'' అంటూ ట్వీట్ చేసింది.

ఈ ట్వీట్ కి టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న, ఏపీ అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌‌లను ట్వీట్‌లో అనసూయ ట్యాగ్ చేశారు. అయితే,జోగు రామన్న తెలంగాణ అటవీ శాఖ మంత్రి అనుకొని అనసూయ ఆయన్ని ట్వీట్‌లో ట్యాగ్ చేశారు. పొరపాటు గ్రహించిన అనసూయ జోగు రామన్నకి క్షమాపణలు చెప్పి.. కరెంట్ అఫైర్స్‌పై తనకున్న అజ్ఞానాన్ని మన్నించి సమస్యపై తన ఇంటెన్షన్‌ను పరిగణనలోకి తీసుకోవాలని పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డిని కోరారు.