సూపర్ స్టార్ మహేష్ వైఫ్ నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు. సోషల్ యాక్టివిటీస్ తో పాటు వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ మాజీ మిస్ ఇండియాకు పిల్లలంటే మహా ప్రేమ. అందుకే సితార, గౌతమ్ ఫోటోలు, వీడియోలు తరచుగా అప్లోడ్ చేస్తూ ఉంటారు. పిల్లలతో తన మెమరీస్ తో పాటు పాత ఫోటోలు పంచుకోవడం నమ్రతకు నచ్చిన అలవాటు. 


తాజాగా బుల్లి సితార ఫోటో పంచుకున్న నమ్రత ఆసక్తికర కామెంట్స్ చేశారు. బాధ, ఆవేదన, విపత్కర పరిస్థితుల నడుమ, ఈ ఫోటో నా ముఖంలో చిరునవ్వు తీసుకువచ్చింది... అంటూ ఒకటి రెండేళ్ల ప్రాయంలో ఉన్న సితార ఫోటోను ఆమె ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. కరోనా సంక్షోభం, బాధాకర పరిస్థితుల మధ్య  సితార చిన్ననాటి ఫోటో తనకు రిలీఫ్ ఇచ్చినట్లు నమ్రత పరోక్షంగా తెలిపారు. 


మహేష్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన సినీ జర్నలిస్ట్, పిఆర్ఓ బిఏ రాజు ఆకస్మిక మరణం పొందిన విషయం తెలిసిందే. కృష్ణగారి అభిమానిగా ఆయనకు దగ్గరైన బిఎ రాజు టాలీవుడ్ సక్సెస్ ఫుల్ పిఆర్ఓగా వందల చిత్రాలకు పనిచేశారు. రాజు అకాల మరణం మహేష్ కుటుంబాన్ని తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. మహేష్ తో పాటు నమ్రత సైతం సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.