అల్లు శిరీష్ హీరోగా నటించిన ఏబీసీడీ మొన్న శుక్రవారం థియేటర్లలో కి వచ్చింది. సంజీవ్ దర్శకత్వంలో మధుర శ్రీధర్ - యశ్ రంగినేని సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాపై క్రిటిక్స్  మాత్రమే కాక సామాన్య ప్రేక్షకుడు సైతం  పెదవి విరిచేసిన సంగతి తెలిసిందే.  ఈ నేపధ్యంలో అల్లు శిరీష్ తన తదుపరి చిత్రం ఎలాంటి కథ చేస్తాడు...ఏ దర్శకుడుతో చేయబోతున్నాడనేది చర్చనీయాంశంగా మారింది. 

అయితే ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు నితిన్ తో ఆ మధ్యన కొరియర్ బాయ్ కళ్యాణ్ అనే డిజాస్టర్ చిత్రం డైరక్ట్ చేసిన ప్రేమ్ సాయి  ని అల్లు శిరీష్ తదుపరి చిత్రానికి ఎంచుకున్నట్లు సమాచారం. ఇది అల్లు అరవింద్ నిర్ణయం అని, గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.

ఫ్లాఫ్ డైరక్టర్స్ తో మంచి కథలు చేయించి హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యారు అల్లు అరవింద్. ఇంతకుముందు ప్లాఫ్ ల్లో ఉన్న దర్శకుడు పరుసరామ్ తో శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం చిత్రాలు చేసి హిట్ కొట్టారు. అలాగే ఇప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ తో అఖిల్ హీరోగా చిత్రం చేస్తున్నారు. అదే వరసలో ఈ ప్రేమ్ సాయి చేత కూడా తన కొడుకుని హీరో పెట్టి ఓ హిట్ ఇద్దామనే ఈ నిర్ణయం తీసుకున్నాడంటున్నారు.

అయితే ఈ వార్త విన్నవాళ్లు మాత్రం  అసలే ప్లాఫ్ ల్లో ఉన్న తన కొడుకుని పోయి పోయి ఓ ప్లాఫ్ డైరక్టర్ చేతిలో పెట్టడం ఏమిటని అంటున్నారు. పరుసరామ్ కు సినిమా ఇచ్చారంటే కెరీర్ ప్రారంభంలో అతనికి హిట్స్ ఉన్నాయి,బొమ్మరిల్లు భాస్కర్ కు సైతం సూపర్ హిట్స్   ఉన్నాయి. కానీ ఒకే సినిమా వయస్సు ఉన్న అదీ ఓ ప్లాఫ్ డైరక్టర్ చేతిలో తన కొడుకు ని పెట్టడం మాత్రం అల్లు అరవింద్ కు పద్దతి కాదంటన్నారు.