ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మైహోమ్స్ రామేశ్వరరావ్ సంయుక్తంగా  డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ ‘అహా’ ఓటీటీ(OTT)ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే అనుకున్న విధంగా ఈ ఓటీటీ దూసుకుపోవటం లేదు. సబ్ స్క్రిప్షన్ ఫీ ఎక్కువ ఉందని, దాని బదులు నెట్ ఫ్లిక్స్ వైపు వెళ్తే గిట్టు బాటు అవుతుందని చాలా మంది భావిస్తున్నారు. అయితే తమది లోకల్ కంటెంట్ కాబట్టి రూరల్ ప్రాంతాల్లోకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు అల్లు అరవింద్. అందుకోసం పెద్ద తలకాయలను సీన్ లోకి తెస్తున్నారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ని సైతం తమ ఆహా కోసం అడిగినట్లు సమాచారం. 

అయితే తాను ప్రస్తుతం ఉన్న బిజీలో వెబ్ సీరిస్ లకు రాయటం లేదా పర్యవేక్షించటం వంటివి చేయలేనని, ఓ యాడ్ చేసిపెడతాను అని హామీ ఇచ్చారట. దాంతో అల్లు అర్జున్ తో ఆహా కోసం ఓ యాడ్ తీయటానికి సన్నాహాలు చేస్తున్నారు. దాన్ని త్రివిక్రమ్ డైరక్ట్ చేయనున్నారు. ఆహా ప్రమోషన్ కోసం సరికొత్త కాన్సెప్ట్‌తో త్రివిక్రమ్, బన్నీతో కలిసి ఓ ప్రమోషనల్ వీడియో రూపొందించనున్నారు. త్వరలో షూట్ ప్రారంభంకానుందని ఫిలింనగర్ టాక్. 

 దాంతో అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మళ్లీ కలిసి పనిచేయబోతున్నారు అనే వార్త ఫిలింనగర్లో హల్ చల్ చేస్తోంది. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, తాజాగా ‘అల.. వైకుంఠపురములో’.. ఈ కాంబోలో హ్యాట్రిక్ హిట్స్ వచ్చాయి. నాలుగోసారి త్రివిక్రమ్, బన్నీని డైరెక్ట్ చేయనున్నాడు.

ఇక ఇప్పటికే ఆహా లో పలు లేటెస్ట్ మూవీస్ స్ట్రీమింగ్ అవుతండగా వెబ్ సిరీస్ ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. నవదీప్, బిందు మాధవి, విజయ్ దేవరకొండ వంటి సెలబ్స్ ‘అహా’కు ప్రమోటర్స్‌గా వ్యవహరిస్తున్నారు.