రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఈ మధ్య అల్లు అర్జున్ ని ఆకాశానికి ఎత్తేస్తున్న విషయం తెలిసిందే. పుష్ప విడుదలకు ముందే అల్లు అర్జున్ మెగా హీరోల్లోనే బడా స్టార్ అంటూ ట్వీట్స్ చేశారు. తాజాగా వర్మ ఓ న్యూస్ ఛానల్ డిబేట్ లో పాల్గొన్నారు. ఈ సంధర్భంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భీమ్లా నాయక్ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని వర్మ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కి వర్మ కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు. మీకంటే వెనకొచ్చిన ఎన్టీఆర్, చరణ్, బన్నీ కూడా పాన్ ఇండియా హీరోలు అవుతుంటే మీరు టాలీవుడ్ ని పట్టుకొని వేలాడుతున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ అభిమానిగా భీమ్లా నాయక్ అన్ని ప్రధాన భాషల్లో విడుదల చేసి, దేశంలోనే అతి పెద్ద స్టార్ అని నిరూపించుకోవాలని ట్వీట్స్ పోస్ట్స్ చేశారు.
భీమ్లా నాయక్ (Bheemla nayak) చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలన్న వర్మ అభిప్రాయంపై ఓ ఛానెల్ లో డిబేట్ పెట్టారు. ఈ చర్చలో పాల్గొన్న వర్మ పుష్ప మూవీ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ వర్గాలకు పుష్ప విజయం ఓ పెద్ద షాక్ అన్నారు. వర్మకు సన్నిహితులు పుష్ప మూడో రోజే థియేటర్స్ నుండి ఎత్తేస్తారని చెప్పారట. అలాంటి పుష్ప మూవీ కోవిడ్ ఆంక్షల మధ్య వంద కోట్లు వసూలు చేయడం చూసి ట్రేడ్ వర్గాలు విస్మయం చెబుతున్నాయి. అసలు ఇది ఎలా సాధ్యమైందని తలలు పట్టుకుంటున్నారని వర్మ తెలియజేశారు.
పుష్ప (Pushpa)లాంటి సినిమా చేయాలనే ఆలోచన కూడా బాలీవుడ్ దర్శక నిర్మాతలకు, హీరోలకు రాదు. ఎందుకంటే హీరో అంటే హ్యాండ్ సమ్ గా, ఫెయిర్ గా ఉండాలి అనేది వాళ్ళ సిద్ధాంతం. అల్లు అర్జున్ చేసిన డీగ్లామర్ రోల్ చేయడానికి వారు ఇష్టపడరు. ఓ మోస్తరుగా ఉండే అల్లు అర్జున్ ఉన్న అందాన్ని కూడా తగ్గించుకొని పుష్పలో డీగ్లామర్ రోల్ చేశాడు. అలాంటి అర్జున్ ని అక్కడి ప్రేక్షకులు ఇష్టపడ్డారు. బాలీవుడ్ లోని ఓ ఫిల్మ్ క్రిటిక్ కి అసలు ఏ మూవీ నచ్చదు. అలాంటి క్రిటిక్ పుష్ప అద్భుతం అంటూ నాకు ఫోన్ చేశారు. హిందీ ప్రేక్షకులు పుష్ప ఓ వండర్ లా ఉంది... అంటూ వర్మ పుష్ప గురించి బాలీవుడ్ ప్రేక్షకుల అభిప్రాయం తెలియజేశారు.
పుష్ప చిత్రానికి పోటీగా వచ్చిన కపిల్ దేవ్ బయోపిక్ '83' రేసులో వెనుకబడింది. రణ్వీర్ సింగ్ వంటి స్టార్ హీరో నటించిన ఆ చిత్రం పుష్ప మూవీ ముందు తేలిపోవడం ఊహించని పరిణామం. హిందీ ప్రేక్షకులకు టాలీవుడ్ సినిమాలపై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దాని ప్రభావమే పుష్ప విజయం. బాలీవుడ్ చిత్రాలకు పూర్తి భిన్నంగా తెరకెక్కే సౌత్ ఫ్లేవర్ వాళ్లకు నచ్చుతుంది. తెలుగు రాష్ట్రాల్లో పుష్ప లాభాలు తేకపోగా నష్టాలు మిగిల్చింది. ముఖ్యంగా ఏపీలో డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోగా నిర్మాతలు కొంత మేర రీఫండ్ చేశారు. సొంత పరిశ్రమలో ఒడిదుడుకులు ఎదుర్కొన్న పుష్ప హిందీలో సూపర్ హిట్ గా నిలిచింది
