చిత్ర పరిశ్రమకు సంక్రాంతి కాసులు కురిపించే సీజన్. ప్రతి ఏటా సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల సందడి చూస్తుంటాం. సాధారణ సీజన్లో స్టార్ హీరోల సినిమాలు తక్కువ గ్యాప్ లో విడుదలైతే వసూళ్లపై ప్రభావం ఉంటుంది. కానీ సంక్రాంతికి మాత్రం ఆ ప్రభావం కనిపించదు. సినిమాలో కంటెంట్ ఉండాలే కానీ విడుదలైన ప్రతి చిత్రానికి మంచి ఆదరణ ఉంటుంది. 

అందుకే నిర్మాతలు తమ చిత్రాలని సంక్రాంతి బరిలో నిలిపేందుకు ఆరు నెలల ముందుగానే రిలీజ్ డేట్స్ ప్రకటిస్తుంటారు. 2020 సంక్రాంతి బరిలో నిలిచిన తొలి చిత్రం సూపర్ స్టార్ మహేష్ దే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్నట్లు దిల్ రాజు ఇదివరకే ప్రకటించారు. 

తాజాగా మరో భారీ చిత్రం కూడా సంక్రాంతి బరిలో నిలిచింది. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. అరవింద సమేత తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఇది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అరవింద్, రాధాకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలతో సంక్రాంతి సమరం రంజుగా మారబోతోంది.