తగ్గేదేలే: నిర్మాతలపై ఆ విషయమై బన్ని ప్రెజర్?సుక్కు ప్లాన్ వేరే
రంగస్థలంలాంటి భారీ విజయం తర్వాత సుకుమార్ తెరకెక్కిస్తోన్న సినిమా అలాగే.. అల వైకుంఠపురంలో లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత అల్లు అర్జున్ నటిస్తోన్న సినిమా కావడంతో పుష్ప సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి.
పెద్ద సినిమాలకు రిలీజ్ డేట్స్ ప్రకటించటం మామూలుగానే తలనొప్పి. దానికి కరోనా కలిసొచ్చింది. దాంతో ఏ పెద్ద సినిమా ఎప్పుడొస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. రిలీజ్ డేట్ లు ప్రకటించడం, మళ్ళీ ఫోస్ట్ ఫోన్ చెయ్యడం చూస్తూనే ఉన్నాం. సెకండ్ వేవ్ ముగిసిందనుకుంటున్న టైంలో ఇంకోటి వచ్చి పడే వాతావరణం కనపడుతోంది. హైదరాబాద్ లో మళ్లీ కేసులు పెరుగుతూండటం... థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉండటం రిలీజ్ లను భయపెడుతున్నాయి.అయితే సర్లే వాటి సంగతి తర్వాత అని పెద్ద సినిమాలు అన్ని వరసపెట్టి రిలీజ్ డేట్స్ ప్రకటించారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ తన తాజా చిత్రం పుష్ప రిలీజ్ డేట్ ప్రకటన కోసం నిర్మాతలపై ఒత్తిడిపెడుతున్నట్లు వినపడుతోంది.
ఇక సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ “పుష్ప”. ఈ చిత్రం రెండు పార్ట్ లకు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యన షూటింగ్ కు రీసెంట్ గా బ్రేక్ పడిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం సుకుమార్‌కు డెంగ్యూ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో “పుష్ప” షూటింగ్ ఆగిపోయింది. దర్శకుడు సుకుమార్ రెస్ట్ తీసుకోవటంతో బ్రేక్ పడినా..తిరిగి షూటింగ్ ప్రారంభం అయ్యింది. సుకుమార్ ఓవర్ టైమ్ వర్క్ చేస్తూ స్పీడుగా కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అల్లు అర్జున్ ఈ సినిమా ఫస్ట్ పార్ట్ త్వరలోనే ఎట్టి పరిస్దితుల్లోనూ రిలీజ్ కావాలని పట్టుపడుతున్నారట.
వచ్చే సంవత్సరం రిలీజ్ చేద్దామని సుకుమార్ ప్లాన్, కానీ బన్ని ఈ సంవత్సరమే వచ్చేయాలని కోరుకుంటున్నారట. ప్రకటన వస్తే బాగుంటుందని సూచించారట. వాస్తవానికి ఈ చిత్రం మొదటి భాగం ఈ ఏడాది ఆగస్టు 13న, రెండవ భాగం 2022లో విడుదల అయ్యేలా ప్లాన్ చేసారు. కానీ ఇప్పుడది సాధ్యం కాదు. దాంతో కొత్త రిలీజ్ డేట్ తో ప్రకటన కావాలంటున్నారట. ఈ మేరకు నిర్మాతలు డైరక్టర్ తో మాట్లాడుతున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.
రష్మిక మండన్న హీరోయిన్ గా నటించిన “పుష్ప” గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”ను రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు మే నెలలో మేకర్స్ ప్రకటించారు. తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలతో పాటు తెలుగులో భారీ రేంజ్ లో విడుదల కానుంది. ప్రధాన విలన్ పాత్రలో ఫహద్ ఫాసిల్ నటిస్తుండగా… ఈ యాక్షన్ డ్రామాను ముత్తాశెట్టి మీడియా సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
ఇక ఇప్పటికే మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. జనవరి 13, 2022 అని పోస్టర్ లో డేట్ పడింది. అలాగే ప్రభాస్ నటిస్తున్న ‘రాధేశ్యామ్’ డేట్ కూడా వచ్చేసింది. జనవరి 14, 2022… దాని విడుదల తేదీ.
మరో ప్రక్క పవన్ కళ్యాణ్ – రానా కాంబినేషన్ మూవీ కూడా సంక్రాంతి బరిలోకి దూకుతోంది. ఈ సినిమాకి ఇంకా టైటిల్ చెప్పలేదు. డేట్ కూడా ప్రకటించలేదు. జనవరి 12, 2022 అనే డేట్ అనుకుంటున్నట్లు సమాచారం. వెంకటేష్, వరుణ్ తేజ్ ల మల్టీస్టారర్ “F3” కూడా జనవరి 12 కానీ, జనవరి 14 కానీ విడుదలయ్యే అవకాశం ఉంది.