`ఆర్‌ఆర్‌ఆర్‌`లో తన పాత్ర నిడివిపై, రాజమౌళిపై అలియాభట్‌ అసంతృప్తితో ఉన్నారని, దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో సినిమా పోస్ట్ లు తీసేశారని వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అలియాభట్‌ స్పందించింది.

బాలీవుడ్‌ బ్యూటీ, `ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR Movie) హీరోయిన్‌ అలియాభట్‌(Alia Bhatt) తనపై ప్రచారం అవుతున్న వార్తలపై స్పందించింది. `ఆర్‌ఆర్‌ఆర్‌`లో ఆమె పాత్ర పట్ల తను అసంతృప్తిగా ఉన్నట్టు, రాజమౌళి(Rajamouli)పై కోపంతో ఇన్‌స్టాలో పోస్ట్ లు తీసేసినట్టు వార్తలు వైరల్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో దీనిపై తాజాగా అలియాభట్‌ స్పందించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. యదృచ్చికంగా జరిగిన విషయాన్ని తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆమె విచారం వ్యక్తం చేశారు. 

ఇందులో అలియాభట్‌ చెబుతూ, తాను `ఆర్‌ఆర్‌ఆర్‌`లో తన పాత్ర నిడివి పట్ల, రాజమౌళి పట్ల అసంతృప్తితో ఉన్నట్టు, దీంతో తన ఇన్‌స్టాగ్రామ్‌లో `ఆర్‌ఆర్‌ఆర్‌` పోస్ట్ లు తొలగించినట్టు విన్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో జరిగే యాదృచ్చికమైన విషయాలను బట్టి అంచనా వేయోద్దని ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నా. నేను ఎల్లప్పుడు పాత పోస్ట్ లను డిలీట్‌ చేస్తుంటాను. చిందరవందరగా ఉండటాన్ని ఇష్టపడను. అందులో భాగంగానే ఇది జరిగిందని వివరణ ఇచ్చింది అలియా. 

ఆమె ఇంకా చెబుతూ, నేను `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమాలో భాగమైనందుకు ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను. సీతగా నటించడాన్ని ఇష్టపడ్డాను. రాజమౌళి సర్‌తో పనిచేయడాన్ని ఇష్టపడ్డాను. అలాగే తారక్‌, రామ్‌చరణ్‌లతోనూ తెరని పంచుకోవడం కూడా ఎంతో నచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అనుభవాన్ని నేను ఇష్టపడ్డాను, ఆస్వాదించాను. 

`నేను ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నా. ఎందుకంటే రాజమౌళి సర్‌, ఆయన బృందం ఈ అందమైన సినిమాకి జీవం పోయడానికి ఏళ్ల తరబడి కృషి చేశారు, ఎంతో హార్డ్ వర్క్ చేశారు. అంతేకాదు ఓ సినిమా గురించి తాను తప్పుడు సమాచారం ఇచ్చేందుకు ఎప్పుడూ అంగీకరించను` అని తెలిపింది అలియాభట్‌. ప్రస్తుతం ఈ అలియా పోస్ట్ ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతుంది. 

ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ హీరోలుగా రాజమౌళి రూపొందించిన భారీ సినిమా `ఆర్‌ఆర్‌ఆర్‌`. భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. దాదాపు పదివేల స్క్రీన్లలో సినిమా విడుదలై బ్లాక్‌ బస్టర్‌ టాక్‌తో దూసుకుపోతుంది. ఐదు రోజుల్లో ఈ సినిమా ఏకంగా 600కోట్లు వసూలు చేసింది. ఇప్పటికీ విజయవంతంగా రన్‌ అవుతుంది. ఇందులో సీత పాత్రలో రామ్‌చరణ్‌కి జోడీగా అలియాభట్‌ నటించింది. అయితే ఆమె పాత్ర నిడివి చాలా తక్కువగా ఉండటంతో ఈ వివాదం మొదలైంది. మరోవైపు అజయ్‌ దేవగన్‌, శ్రియా, సముద్రఖని కూడా కీలక పాత్రలు పోషించారు.