కరోన సినీ రంగాన్నే ఆ రంగంలోని వ్యక్తుల వ్యక్తిగత జీవితాలను కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందుల పాలు చేస్తోంది. ముఖ్యంగా ఈ ఏడాది ఓ ఇంటివారు కావాలని ప్లాన్ చేస్తున్న తారలకు ఈ మహమ్మారి చుక్కలు చూపిస్తోంది. టాలీవుడ్‌లో నిఖిల్‌, నితిన్‌ లాంటి వారి పెళ్లిళ్లకు కరోనా అడ్డుపడింది. అయితే నిఖిల్ లాంటి వారు సింపుల్‌గా పెళ్లి పనులు ముగించేస్తే, నితిన్‌ కూడా అదే బాటలో నడిచేందుకు రెడీ అవుతున్నాడు. ఈ కష్టాలు టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌లో కూడా ఉన్నాయి.

బాలీవుడ్ లవ్‌ కపుల్‌ అలీ ఫ‌జ‌ల్‌, రిచా చ‌ద్దా ఈ ఏడాది ఏప్రిల్‌ 15న పెళ్లి చేసుకోవాలని భావించారు. కానీ వారి కలల మీద కరోనా నీళ్లు చల్లింది. దీంతో తప్పని సరి పరిస్థితుల్లో వివాహాన్ని వాయిదా వేసుకున్నారు ఈ జంట. అయితే తాజాగా తమ ప్రేమ గురించి ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు రిచా, అలీ. ఈ సందర్భంగా రిచా మాట్లాడుతూ.. `అలీ మాల్దీవుల్లోని ఐలాండ్‌లో రొమాంటిక్ డిన్న‌ర్ కు ఏర్పాట్లు చేశాడు. నేను నా పుట్టిన‌రోజు కోసమేమో అనుకున్నా. ఆ రోజు మేము క‌లిసి డిన్నర్‌ చేస్తున్నాం

ఒక్కసారిగా అలీ ధైర్యం చేసి న‌న్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడు. ‌ఆ త‌ర్వాత‌ 10 నిమిషాల ఏం మాట్లాడకుండా సైలెంట్‌ అయిపోయాడు. ప్రపోజ్ చేసినందుకు ఆయన భయపడ్డాడేమో అనుకున్నా..? కానీ సింపుల్‌గా ప్రపోజ్ చేశాడు కానీ, సినిమాటిక్‌గా మోకాళ్ల మీద కూర్చొని, చేతిలో ఉంగరం తో ప్రపోజ్ చేయలేదు నేను మాత్రం ఒకే చెప్పడానికి మూడు నెలల సమయం తీసుకున్నా. ఒకసారి మా ఇంట్లో ఇద్దరం కలిసి చార్లి చాప్లిన్ సినిమా చూస్తుండగా అలీ చాలా ఆనందంగా ఉన్న సమయంలో ఓకె చెప్పా` తన ప్రేమ కథను వివరించింది రిచా.