బాలీవుడ్ తారలు తమ ఇండస్ట్రీలో సౌత్ వాళ్ల డామినేషన్ ని అసలు తట్టుకోలేరు. 'బాహుబలి' సినిమా హిందీలో రిలీజై రికార్డులు తిరగరాస్తుంటే ఇండస్ట్రీని ఏలుతోన్న ముగ్గురు ఖాన్ లలో ఒక్కరు కూడా సినిమాను ప్రశంసిస్తూ కామెంట్ చేయలేదు. ఆ ముగ్గురు హీరోలు మాత్రమే కాదు.. బాలీవుడ్ కి చెందిన చాలా మంది సెలబ్రిటీలు 'బాహుబలి' గురించి తమకు తెలియదన్నట్లుగా ప్రవర్తించారు.

'బాహుబలి' రికార్డులను అధిగమించాలని కొన్ని ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ఇప్పుడు భారీ బడ్జెట్ తో వస్తోన్న మరో తెలుగు సినిమా 'సాహో'ని కూడా అక్కడి తారలు పట్టించుకుంటున్నట్లుగా కనిపించడం లేదు. ఇప్పటికే అక్షయ్ కుమార్ 'సాహో'కి పోటీగా తను నటించిన 'మిషన్ మంగళ్' ని రిలీజ్ చేస్తున్నాడు. అతడి మాటల్లో ఎక్కడా కూడా 'సాహో' పేరు వినిపించలేదు.

తాజాగా జాన్ అబ్రహాం కూడా ఇలానే ప్రవర్తించాడు. అతడు నటించిన 'బత్లా హౌస్' చిత్రాన్ని ఆగస్ట్ 15న 'సాహో'కి  పోటీగా దిన్చుతున్నాడు. అయితే ఆ రోజు 'మిషన్ మంగళ్' సినిమా మాత్రమే కాంపిటిషన్ కి ఉన్నట్లు జాన్ అబ్రహాం మాట్లాడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అదే రోజున 'సాహో' భారీ స్థాయిలో హిందీలో కూడా రిలీజ్ అవుతున్నా జాన్ అబ్రహాం దాన్ని లెక్క చేయడం లేదు. 

పోటీ రెండు సినిమాల మధ్య ఉందని.. ఏది బాగుంటే దాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని.. రెండు బాగుండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. 'సాహో' గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. బాలీవుడ్ లో సరైన మార్కెట్ లేని జాన్ అబ్రహాం లాంటి వాళ్లు 'సాహో'ని లెక్క చేయడం లేదంటే ఇక సూపర్ స్టార్లు తెలుగు సినిమాలను ఏం పట్టించుకుంటారు..?