కరోనా సెకండ్‌ వేవ్‌ మరింతగా విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. కరోనా దెబ్బకి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉంది. అయినా కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. ఈ దెబ్బకి చిత్రపరిశ్రమ సైతం ఆగిపోయింది. షూటింగ్‌లు, థియేటర్లు బంద్‌ అయ్యాయి. పనిలేక సినీ కార్మికులు రోడ్డున పడే పరిస్థితి. ఆదుకునే దిక్కులేదు. ప్రభుత్వాలు నిమ్మకుంటున్నాయి. ఓ రకంగా చెతులెత్తేసిన పరిస్థితి. ఈ క్రమంలో ఒకరిద్దరు స్టార్స్ సినీ కార్మికులను ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు. 

బాలీవుడ్‌లో డాన్సర్లని అదుకునేందుకు అక్షయ్‌ కుమార్‌ ముందుకొచ్చారు. ఆయన గతేడాది కరోనా సమయంలో పీఎం కేర్‌ నిధికి 25కోట్లు విరాళంగా అందించారు. ఇప్పుడు 3600 మంది సినీడాన్సర్లని ఆదుకుంటున్నారు. వారికి ప్రతి నెల రేషన్‌ సరుకులు అందిస్తున్నారు. ఈ విష‌యాన్ని కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య మీడియాకు తెలిపారు. చిత్ర పరిశ్రమలోని 1,600 జూనియర్ డాన్స‌ర్లు,  రెండు వేల మంది నేపథ్య నృత్యక‌ళాకారుల‌కు అక్ష‌య్ ప్ర‌తినెలా ఈ సహాయం చేయనున్నార‌ని చెప్పారు. తెలుగులో ఇలా ఏ పెద్ద హీరో ముందుకు రాకపోవడం విచారకరం. 

ఇక బాలీవుడ్‌లో ఏడాదికి అత్యధిక చిత్రాలు చేసే హీరోగా అక్షయ్‌ నిలుస్తున్నారు. ఆయన్నుంచి ఒక్కో ఏడాది మూడు నుంచి దాదాపు ఐదు సినిమాల వరకు విడుదలవుతుంటాయి. ఆయనే ఓ మిని ఇండస్ట్రీగా చెబుతుంటారు. ప్రస్తుతం అక్కీ చేతిలో `సూర్యవంశీ`,`బెల్‌ బాటమ్‌`, `పృథ్వీరాజ్‌`, `ఆట్రాంగి రే`, `బచ్చన్‌ పాండే`, `రామ్‌ సేతు` చిత్రాలున్నాయి.