అక్షయ్ కుమార్ మరోసారి తన గొప్ప మనసు చాటుకుని ప్రశంసలు అందుకుంటున్నారు. ఏకంగా 650 మంది స్టంట్ మ్యాన్ లకు అక్షయ్ ఇన్సూరెన్స్ చేయించారు. 

అక్షయ్ కుమార్ గొప్ప మనసు

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. ఇండియాలో వరుసగా సినిమాలు చేస్తూ ఎక్కువగా బిజీగా ఉండే హీరోల్లో అక్షయ్ ఒకరు. ఇటీవల తమిళ డైరెక్టర్ పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వేట్టువం చిత్ర షూటింగ్ లో స్టంట్ మ్యాన్ రాజు ప్రమాదవశాత్తు మరణించారు. అతడి మరణ వార్త చిత్ర పరిశ్రమని విషాదానికి గురిచేయడమే కాదు.. చర్చనీయాంశం కూడా అయింది. 

650 మందికి ఇన్సూరెన్స్ చేయించిన అక్షయ్ 

స్టంట్ మ్యాన్ రాజు మరణం గురించి తెలుసుకున్న అక్షయ్ కుమార్ చలించిపోయారు. ఈ సంఘటన తర్వాత అక్షయ్ కుమార్ స్టంట్ మ్యాన్ ల భద్రత, వారి కుటుంబాల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని గొప్ప పని చేశారు. అక్షయ్ కుమార్ ఏకంగా 650 మంది స్టంట్ మ్యాన్ లకు ఇన్సూరెన్స్ చేయించారు. 

స్టంట్ మ్యాన్ లు ప్రాణాలు పణంగా పెట్టి స్టంట్స్ చేస్తుంటారు. వారికి సరైన పారితోషికాలు ఉండవు. ఏదైనా ప్రమాదం జరిగితే ఆ వారి కుటుంబాలు తీవ్రమైన కష్టాల్లో చిక్కుకుంటాయి. అందువల్ల వారికి సాయంగా అక్షయ్ కుమార్ స్టంట్ మ్యాన్ లకు ఇన్సూరెన్స్ చేయించారు. ఇందులో ఆరోగ్య, ప్రమాద బీమా రెండూ ఉంటాయి. ఏదైనా ప్రమాదంలో గాయపడితే వారికి రూ 5 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. 

అక్షయ్ కుమార్ చేసిన ఈ పని అందరి హృదయాల్ని గెలుచుకుంటోంది. అక్షయ్ కుమార్ సినిమాల్లో రిస్క్ తో కూడిన రియల్ స్టంట్స్ ఎక్కువగా చేస్తుంటారు. అక్షయ్ కుమార్ కి మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం ఉంది. ఇదిలా ఉండగా అక్షయ్ కుమార్ చివరగా కన్నప్ప చిత్రంలో మహాశివుడిగా నటించారు.