అక్కినేని వారసుడు అఖిల్‌ హీరోగా స్థిరపడే క్రమంలో స్ట్రగుల్‌ అవుతున్నాడు. `అఖిల్‌`, `హలో`, `మిస్టర్‌ మజ్ను`  చిత్రాల్లో నటించినా, అవి బ్యాక్‌ టూ బ్యాక్‌ పరాజయం చెందాయి. ఇప్పుడు ఎలాగైనా హిట్‌ కొట్టాలని `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` చిత్రంలో నటిస్తున్నాడు. 

అఖిల్‌, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి `బొమ్మరిల్లు` భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సగానికిపైగానే షూటింగ్‌ పూర్తి చేసుకుంది. కరోనా వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో క్రమంగా షూటింగ్‌లు ప్రారంభమవుతున్నాయి. 

ఒక స్టార్‌ రేంజ్‌ హీరోల్లో తొలుత షూటింగ్‌ ప్రారంభించింది నాగార్జున మాత్రమే. ఆయన `బిగ్‌బాస్‌4` సీజన్‌ ప్రారంభించారు. అలాగే తాను ప్రస్తుతం నటిస్తున్న `వైల్డ్ డాన్‌` షూటింగ్‌ షురూ చేశారు. తండ్రి బాటలోనే తనయుడు నాగచైతన్య కూడా దూసుకుపోతున్నారు. ఆయన ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో `లవ్‌స్టోరి` చిత్రంలో నటిస్తున్నారు. గత వారంలో ఈ సినిమాని కూడా ప్రారంభించారు. 

ఇప్పుడు అక్కినేని మరో వారసుడు అఖిల్‌ సైతం ధైర్యం ప్రదర్శించారు. తాను నటిస్తున్న `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` షూటింగ్‌ని శుక్రవారం నుంచి ప్రారంభించారు. ప్రభుత్వం నిర్ధేశించిన అన్ని రకాల నిబంధనలతోపాటు, అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలతో షూటింగ్‌కి వెళ్తున్నట్టు చిత్ర బృందం తెలిపింది. గోపీసుందర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని జీఏ2 బ్యానర్‌పై బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లవ్‌ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమానైనా అఖిల్‌కి హిట్‌ ఇస్తుందేమో చూడాలి.