దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి బాలనటుడిగా కొన్ని చిత్రాల్లో నటించారు. ఆ తరువాత 'ఆంధ్రాపోరి' చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. 'మెహబూబా' చిత్రంతో నటుడిగా తన టాలెంట్ నిరూపించుకున్నాడు.

తాజాగా ఆకాష్ మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాతో అనిల్ పాదురి అనే దర్శకుడు పరిచయం కానున్నారు. నేడు ఈ సినిమాను లాంఛనంగా మొదలుపెట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళ్యాణ్ రామ్, రమాప్రభ హాజరు కానున్నారు.

ఈ సినిమాకి 'రొమాంటిక్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. పూరి జగన్నాథ్ ఈ సినిమాకి కథని అందించనున్నారు. కథని అందించడంతో పాటు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ విషయంలో కూడా పూరి  జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో ఆకాష్ సరికొత్త లుక్ తో స్టైలిష్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు.