ఎం.ఐ.ఎం. పార్టీ యాకత్ పురా శాసన సభ్యుడు, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ సయ్యద్ అహ్మద్ పాషా ఖద్రీ సైతం ఈ విషయమై తమ అభ్యంతరాలను తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కు లేఖ ద్వారా తెలియచేశారు. 


నిన్న విడుదలైన విష్ణు విశాల్ ‘ఎఫ్.ఐ.ఆర్.’ మూవీకు అంతటా పాజిటివ్ రివ్యూలే వచ్చాయి. అయితే అంతా సవ్యంగా నడుస్తోంది అనుకున్న సమయంలో ఈ సినిమా లో వాడిన ఓ అరబిక్ పదంతో వివాదానికి తెర లేచింది. ఈ కథలోని హీరో, విలన్ ముస్లిం మతానికి చెందిన వ్యక్తులు కావడంతో కొందరు రాజకీయ నేతలు అందులోని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఎం.ఐ.ఎం. పార్టీ యాకత్ పురా శాసన సభ్యుడు, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ సయ్యద్ అహ్మద్ పాషా ఖద్రీ సైతం ఈ విషయమై తమ అభ్యంతరాలను తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కు లేఖ ద్వారా తెలియచేశారు. ‘ఎఫ్.ఐ.ఆర్.’మూవీ పోస్టర్ పై అరబిక్ భాషలో ఉన్న ‘షహద’ అనే పదం ఇస్లాం మతానికి చెందిందని, అది ఇస్లాం మతానికి సంబంధించిన కీలకమైన అంశమని దానిని పోస్టర్ పై ప్రచురించడం ద్వారా ముస్లింల మనోభావాలను దెబ్బ తీశారని ఆ లేఖలో పేర్కొన్నారు.

అలానే తెలంగాణ సినిమా రెగ్యులేషన్ యాక్ట్ 1955 లోని సెక్షన్ 8 ప్రకారం ఇందులో ముస్లిం మతానికి సంబంధించిన అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని, సినిమాతో పాటు ప్రమోషనల్ వీడియోస్ నుండి వాటిని వెంటనే తీసివేయాలని కోరారు. వాటి ద్వారా సమాజంలో సామరస్యం దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇదిలా ఉంటే చిత్ర యూనిట్ ఇప్పటికే సినిమా రూపకల్పన విషయంలో తమకు ఎలాంటి దురుద్దేశాలూ లేవని, దేశభక్తి పేరితంగానే ఈ చిత్రాన్ని తీశామని, అయినా ముస్లింలు ఒకవేళ తమ మనోభావాలు దెబ్బతిన్నాయని భావిస్తే వారికి క్షమాపణలు చెబుతున్నామని ఓ ప్రకటన విడుదల చేసింది. మరి ప్రభుత్వం ఇప్పుడు ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇక ఈ సినిమాలో హీరో ముస్లిం, అలానే విలన్ ముస్లిం టెర్రరిస్ట్. సాధారణ జీవితం గడుపుతున్న ఇర్ఫాన్ అహమ్మద్ అనే అమాయక యువకుడి జీవితంలో భయంకరమైన ఐఎస్ ఐ ఉగ్రవాది అబూ బక్కర్ అబ్దుల్లా పై జరిగిన పరిశోధన కారణంగా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి?.. చివరికి తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొన్న ఇన్నోసెంట్ ఇర్ఫాన్ అహమ్మద్ దేశ ద్రోహిగా ఎందుకు చిత్రించబడ్డాడు? తనలా మరొకరు బలికాకూడదని తను ఎలాంటి పోరాటం చేశాడన్నదే ఈ చిత్ర ప్రధాన కథ.

ఇర్ఫాన్ అహ్మద్ పాత్ర‌లో విష్ణు విశాల్ న‌టించాడు. విష్ణు విశాల్, రేబా మోనికా జాన్‌ల కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇక తీవ్రవాదుల‌ని నిర్మూలించే ఆఫీస‌ర్ పాత్ర‌లో స్టార్ డైరెక్ట‌ర్‌ గౌతమ్ వాసుదేవ్ మీనన్ న‌ట‌న ప్ర‌త్యేకంగా కనబడుతోంది. మంజిమా మోహన్ స్క్రీన్ ప్ర‌జెన్స్ ప్ల‌జంట్‌గా ఉంది. అరుల్ విన్సెంట్ కెమెరా ప‌నిత‌నం, అశ్వంత్ సంగీతం ఈ సినిమాకు మేజ‌ర్ హైలెట్స్ అయ్యాయి. ఓవరాల్‌గా ఈ ట్రైల‌ర్ సినిమాపై అంచనాల‌ను పెంచేదిగా ఉంది. ఫిబ్రవరి 11న ఈ చిత్రం విడుదల అయ్యింది.