పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న అజ్ఞాతవాసి చిత్రం ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్ కు కాపీ  అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో..  ఆ మూవీ కాపీరైట్స్ దక్కించుకున్న టీ సిరీస్ తో.. రానా మధ్యవర్తిగా అజ్ఞాతవాసి బృందం చర్చలు జరుపుతోందని జోరుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అజ్ఞాతవాసిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా.. వివాదాలు కూడా ఇలా వెంటాడుతుండటంతో అజ్ఞాతవాసి  మరింతగా టాక్ ఆఫ్ టాలీవుడ్ అయిపోయింది. ఇప్పటికే అజ్ఞాతవాసి చిత్రంపై క్లారిటీ ఇవ్వాలని టీ సిరిస్ సంస్థ హారిక హాసిని సంసస్థకు నోటీసు కూడా పంపిందని సమాచారం. అయితే దీనిపై త్రివిక్రమ్ గానీ, అజ్ఞాతవాసి నిర్మాత గానీ స్పందించలేదు.

 

అజ్ఞాతవాసి కి సంబంధించిన టీమ్ అంతర్గత సమాచారం ప్రకారం టీ సిరీస్, హారిక హాసిని మధ్య చర్చలు త్వరలోనే జరుగుతాయని తెలుస్తోంది. అయితే బయట ప్రచారం జరుగుతున్నట్టు ఇప్పటి వరకు హారికా హాసిని సంస్థ తరపున టీ సిరీస్ కు పెద్దగా ఎలాంటి ప్రామిస్  లభించ లేదు. మరోవైపు దర్శకుడు త్రివిక్రమ్ అజ్ఞాతవాసి చిత్రం ఎడిటింగ్ లో తుది మెరుగుతు దిద్దే పనిలో నిమగ్నమై వున్నారు. పని పూర్తి కాగానే ఈ అంశానికి ముగింపు పలుకుతారని తెలుస్తోంది.

 

అజ్ఞాతవాసి చిత్రంలో పవన్ సరసన కీర్తి సురేష్, అను ఎమాన్యుయెల్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఖుష్బూ కీలకపాత్రలో నటిస్తోంది. బోమన్ ఇరానీ, రావు రమేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న అజ్ఞాతవాసి చిత్రం జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.