జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. జనసేన పార్టీ స్థాపించిన తర్వాత ఆ పార్టీ తొలిసారి ఎన్నికల బరిలో నిలిచింది. ఇటీవల ముగిసిన ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసింది. పవన్ కళ్యాణ్ స్వయంగా గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసారు. దీనితో జనసేన పార్టీకి ఎలాంటి ఫలితాలు వస్తాయనే ఉత్కంఠ నెలకొంది. మే 23న ఎలాగూ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. 

ఆదివారం సాయంత్రం వెలువడిన వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం జనసేన పార్టీకి ఆశాజనకంగా లేవు. ఎక్కువ సర్వే సంస్థలు జనసేన పార్టీ 5 లోపు అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందని అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో మరోసారి పవన్ సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీ గురించి సోషల్ మీడియాలో వార్తలు మోతెక్కుతున్నాయి.ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ సినిమాల్లో నటించే విషయమై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. 

ఇలాంటి వార్తలు ఎన్ని వచ్చినా జనసేన పార్టీ వర్గాలు మాత్రం ఖండిస్తూ వచ్చాయి. కొన్ని రోజుల క్రితం పవనే స్వయంగా ఈ విషయంలో క్లారిటీ ఇస్తూ తాను రాబోవు 25 ఏళ్ల పాటు రాజకీయాల్లోనే కొనసాగుతానని జనసైనికులతో ప్రస్తావించారు. మెగా బ్రదర్ నాగబాబు కూడా పవన్ సినిమాల్లోకి వస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఏది ఏమైనా పవర్ స్టార్ అసెంబ్లీలోకి అడుగుపెట్టడంపై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.