బిగ్ బాస్ సీజన్ 4 ఫినాలేలో కొన్ని నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. టైటిల్ ఫేవరేట్స్ లో ఒకరిగా ఉన్న సోహెల్ టాప్ 3లో వెనుదిరిగాడు. నాగార్జున ఆఫర్ చేసిన రూ. 25 లక్షలు తీసుకొని టైటిల్ రేసు నుండి తప్పుకుంటున్నట్లు తెలియజేశాడు. సోహెల్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ సమర్ధించారు. అలాగే నాగార్జున అదనంగా మరో పది లక్షలు ప్రకటించడంతో మొత్తంగా రూ. 35 లక్షలు సోహెల్ దక్కించుకున్నాడు.

దీనికి మించి సోహెల్ కి చిరు నుండి బంపర్ ఆఫర్ దక్కింది. నువ్వు హీరోగా ఎప్పుడు సినిమా మొదలుపెట్టినా నాకు సమాచారం అందిస్తే స్వయంగా వచ్చి లాంఛ్ చేస్తానని... అలాగే నీ సినిమాలో చిన్న క్యామియో రోల్ కూడా చేస్తానని హామీ ఇచ్చారు. కోట్ల మంది సమక్షంలో నీకిచ్చిన మాట నేను నెరవేరుస్తాను అన్నారు. చిరు ఆఫర్ కి సోహెల్ కి ఏమి మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. చిరంజీవికి కృతజ్ఞలు తెలుపుతూ సోహెల్ కన్నీరు పెట్టుకున్నాడు. మీలాంటి యువకులు పరిశ్రమలోకి రావాలి, ఎదిగాలి ఆ సత్తా మీలో ఉందని చిరంజీవి ప్రోత్సహించారు. 

మరి చిరంజీవి తన సినిమాలో నటించాడంటే ఎంత ప్రచారం దక్కుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాగా సోహెల్ కి పరిశ్రమ నుండి మరో బడా ఆఫర్ తగిలినట్లు సమాచారం అందుతుంది. స్టార్ కమెడియన్ బ్రహ్మానందం కూడా సోహెల్ మూవీలో నటిస్తానని హామీ ఇచ్చారట. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సోహెల్ మూవీలో నటిస్తానని బ్రహ్మనందం చెప్పినట్లు సమాచారం. దీనితో బిగ్ బాస్ ద్వారా సోహెల్ ఈ రేంజ్ లో ఫేమ్ సంపాదించాడా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.