సీనియర్ నటుడు ఆదిత్య పంచోలిపై బాలీవుడ్ నటి చేసిన ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి. ఆదిత్య పంచోలీ తన విషయంలో ఎన్నో దారుణాలకు పాల్పడ్డాడని బాధితురాలు వెర్సోవా పోలీసులకు ఇచ్చిన రెండున్నర పేజీలా వాంగ్మూలంలో వివరించారు. 2004-2006లో సీనియర్ ఐపీఎస్ అధికారికి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని వాపోయింది.

బాలీవుడ్ లో రాణించాలనే ఆశతో ముంబైకి వచ్చిన ఆమెకి ఆదిత్య పంచోలీతో పరిచయం ఏర్పడిందని అప్పటికి ఆయన వయసు 38 ఏళ్లను.. తనకంటే ఇరవై ఏళ్లు పెద్దవాడని.. అప్పటికే ఆయనకి పెళ్లై, పిల్లలు కూడా ఉన్నారని చెప్పింది. 2004లో ఓరోజు అతడితో కలిసి పార్టీకి వెళ్లినట్లు ఆ సమయంలో తను తాగిన డ్రింక్ లో అతడు ఏదో కలిపాడని చెప్పింది.

పార్టీ తరువాత హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తానని తన కార్ ఎక్కించుకొని కొంతదూరం వెళ్లిన తరువాత యారీ ప్రాంతంలో కారు ఆపేసి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పింది. ఆ దురాగతాన్ని ఫోటోలు తీసి బెదిరించడం మొదలుపెట్టాడని.. ఎంత బతిమాలినా అతడు కరగలేదని ముంబైలో తనకంటూ ఎవరూ లేకపోవడంతో మరింత రెచ్చిపోయాడని తన వాంగ్మూలంలో తెలిపింది.

ఎన్ని సార్లు ఇల్లు మారినా.. ఎలాగోలా అడ్రెస్ తెలుసుకొని అక్కడకి వచ్చి గొడవ చేసేవాడని.. ఒకసారి తన సోదరిపై చేయి కూడా చేసుకున్నాడని చెప్పింది. ఎందుకు ఇలా వేధిస్తున్నావని అడిగితే కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు చెప్పింది. ఎలాగోలా యాభై లక్షలు ఇవ్వడంతో కొద్దిరోజుల పాటు సైలెంట్ గా ఉన్నాడని.. ఆ తరువాత బాలీవుడ్ లో ఆమెకి గుర్తింపు రావడంతో మళ్లీ బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడని బాధితురాలు వివరించింది.

బాధితురాలి సోదరి  ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడంతో గత నెలలో ఆదిత్య పంచోలీపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో తనను కావాలని ఇరికించారని.. తను ఎలాంటి తప్పు చేయలేదని అంటున్నాడు ఆదిత్య పంచోలీ.