నటుడు ఆదిత్య ఓం తెలుగు చిత్ర పరిశ్రమలో మెరుపులా వచ్చి మాయమైపోయాడు. ఆదిత్య ఖాతాలో లాహిరి లాహిరి లాహిరిలో లాంటి సూపర్ హిట్ చిత్రం ఉంది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినా అవి స్టార్ గా ఎదిగేందుకు, కనీసం టాలీవుడ్ లో నిలదొక్కుకునేందుకు కూడా ఉపయోగపడలేదు. దీనితో ఆదిత్య తెలుగు చిత్రాలకు దూరమయ్యాడు. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు తెలియజేశాడు. సీరియల్స్ నుంచి తాను నటుడిగా ఎదిగానని ఆదిత్య తెలిపాడు. సీరియల్స్ లో అవకాశం దొరకడం కూడా అప్పట్లో కష్టంగా ఉండేది. ఓ సీరియల్ లో నటిస్తున్న సమయంలో కెమెరామెన్ కు నేను నచ్చలేదు. 

అతడు కోతిలా ఉన్నాడు సర్.. తీసేద్దాం అని డైరెక్టర్ తో నా గురించి చెప్పాడు. ఆ సమయంలో నాలో నేనే చాలా మదనపడ్డానని ఆదిత్య తెలిపాడు. చిత్ర పరిశ్రమలో కొందరు తనని తప్పుదోవ పట్టించడం వల్లే పరాజయాలు ఎదుర్కొన్నానని తెలిపాడు. ప్రస్తుతం తనకు దర్శకుడు కావాలనే కోరిక ఉందని ఆదిత్య తెలిపాడు. 

దివంగత నటుడు ఉదయ్ కిరణ్ మీకు మంచి ఫ్రెండ్ కదా అనే ప్రశ్నకు ఆదిత్య స్పందించాడు. మరీ క్లోజ్ ఫ్రెండ్ కాదు. పార్టీల్లో తరచుగా కలుసుకునేవాళ్ళం. వ్యక్తిగత విషయాలు చర్చించుకునేంత చనువు మా మధ్య లేదు. కేవలం సినిమా విషయాలే చర్చకు వచ్చేవి. అందుకే ఉదయ్ కిరణ్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడో నాకు తెలియదు. ఆ తర్వాత రెండేళ్ల పాటు టచ్ లో లేం. ఇంతలో చేదు వార్త వినాల్సి వచ్చింది అని ఆదిత్య తెలిపాడు.