ఫైనల్ గా ఆ OTT లోనే ‘ది కేరళ స్టోరీ’ స్ట్రీమింగ్, ఎప్పటినుంచంటే?
థియేటర్లలో అదరగొట్టి, అందరి నోళ్లలో నానిన ది కేరళ స్టోరీ ఓటీటీ రిలీజ్ కోసం మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

‘ఆదాశర్మ’ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’ ఎప్పుడు ఓటిటిలో వస్తుందా అని అభిమానులు కొందరు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. వివాదాస్పద అంశం లవ్ జిహాద్ నేపథ్యంలో డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ సినిమాను తెరకెక్కించారు. రిలీజ్ కు ముందే ఎన్నో అవాంతరాలను ఎదుర్కొన్న ది కేరళ స్టోరీ థియేటర్లలో రిలీజయ్యాక ఒక చిన్నపాటి సెన్సేషనే సృష్టించిందనే చెప్పాలి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఏకంగా ఈ సినిమాను ప్రదర్శించుకుండా నిషేధం విధించారు. అదే సమయంలో మరికొన్ని రాష్ట్రాల్లో పన్ను మినహాయింపు ప్రకటించారు.
బీజేపీ నాయకులు ఈ సినిమాకు మద్దతుగా నిలిస్తే, ప్రతిపక్షాలు మాత్రం విమర్శలు గుప్పించాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా ప్రదర్శనపై అక్కడక్కడా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇలా మొత్తానికి ది కేరళ స్టోరీ పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఆ ఇంపాక్ట్ తో కలెక్షన్లు మాత్రం భారీగా వచ్చాయి. మే 5న విడుదలైన ఈ మూవీకి లాంగ్ రన్‌లో ఏకంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు రావటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇలా థియేటర్లలో అదరగొట్టి, అందరి నోళ్లలో నానిన ది కేరళ స్టోరీ ఓటీటీ రిలీజ్ కోసం మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సినిమా విడుదలై రెండు నెలలు దాటినా మాత్రం ఓటీటీలో విడుదల కాలేదు. చిత్ర నిర్మాత విపుల్ షా.. తన సినిమాను ఏ ఓటీటీ కంపెనీ తీసుకోవడం లేదని, టీవీ ఛానళ్లు శాటిలైట్ రైట్స్‌ను కొనుగోలు చేయడం లేదని, ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారని ఆరోపించారు.అయితే 'ది కేరళ స్టోరీ' సినిమా డిజిటల్(The Kerala Story Digital Rights), శాటిలైట్ హక్కులను విక్రయించడానికి నిర్మాతలు భారీ మొత్తాన్ని డిమాండ్ చేయటమే అందుకు కారణం అని తేలింది. నిర్మాత విఫుల్ షా ‘ది కేరళ స్టోరీ’ సినిమాను విక్రయించేందుకు 75 నుంచి 100 కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడని టాక్. ఇది భారీ మొత్తం కావడంతో టీవీ, OTT ప్లాట్‌ఫారమ్‌లు ఏవీ సినిమాను కొనుగోలు చేయలేదు.
అయితే అందుతున్న సమాచారం మేరకు.. కేరళ స్టోరీ OTT హక్కులు ఇప్పటికే ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ Zee5 తీసుకుందట. థియేట్రికల్ రన్ ముగియడంతో ఈ నెలాఖరు నుంచి ది కేరళ స్టోరీ జీ5లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉండనుందని సమాచారం. అయితే ఈ విషయమే అధికారిక ధృవీకరణ లేదు. ది కేరళ స్టోరీ నిర్మాతలు సైతం సినిమా OTT విడుదలపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.