తెలుగులో హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించిన నటి రక్ష ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి సినిమాలు చేయడం మొదలుపెట్టింది. 'నచ్చావులే' సినిమాలో హీరో తల్లిగా నటించినందుకు ఆమెకి నంది అవార్డు దక్కింది. తాజాగా 'అలీతో సరదాగా' షోలో పాల్గొన్న ఆమె కొన్ని విషయాలను షేర్ చేసుకొంది.

తన తండ్రి నిర్మాతగా రెండు సినిమాలు తీసి నష్టపోయారని.. దాంతో తను సినిమాల్లోకి వచ్చినట్లు చెప్పింది. ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకపోయినా.. తనకు నచ్చి నటిగా కెరీర్ మొదలుపెట్టినట్లు తెలిపింది. అయితే తనతో ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే అసలు ఊరుకోనని అంటోంది. 

అలా చేసిన చాలా మందికి నా చేతుల్లో దెబ్బలు తగిలాయని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఓ డైరెక్టర్ చెంప పగలగొట్టిన విషయాన్ని వివరించింది. ఆ డైరెక్టర్ కథ చెప్పినప్పుడు గ్లామర్ పాత్రల్లో నటించను, నాకు పెళ్లైంది, కూతురుంది.. స్లీవ్ లెస్ డ్రెస్ లు వేసుకోనని చెబితే మొదటి ఓకే చెప్పిన ఆ దర్శకుడు సెట్ కి వెళ్లిన తరువాత తేడాగా ప్రవర్తించడం మొదలుపెట్టాడట.

ద్వందార్ధాలు వచ్చేలా పొగడడం, పదే పదే ఏదో రకంగా విసిగించడం చేస్తుండడంతో 'ఒరేయ్ ఇలా రారా' అని పిలిచి చెంపమీద లాగిపెట్టి కొట్టా.. అని చెప్పుకొచ్చింది. పోలీస్ కంప్లైంట్ కూడా ఇద్దామని అనుకున్నానని, ఆ సినిమా హీరో వచ్చి.. 'వద్దు మేడం.. సినిమా ఆగిపోతుందని' చెప్పడంతో పోనీలే అని వదిలేశానని వెల్లడించింది.