మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు సంబంధించి తాజాగా ఓ ప్రెస్ మీట్ జరిగింది. ఎన్నికలు పూర్తైన తరువాత 'మా' ఎలా ఉంటుందోనని టెన్షన్ పడ్డానని కానీ ఇప్పుడు 'మా' సభ్యుల్లో ఐకమత్యం చూస్తుంటే చాలా అందంగా ఉందని అంటున్నారు నటి హేమ.

ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. లేడీ ఆర్టిస్ట్ లకు వేషాలు ఇవ్వాలని దర్శకనిర్మాతలను కోరారు. ఇండస్ట్రీలో ఆడవాళ్లు వేషాల కోసం చాలా  కష్టపడుతున్నారని.. వారి ఆకలి బాధను అర్ధం చేసుకోండని అన్నారు. 

మొత్తం 'మా'లో ఉన్న 800 మందిలో 100, 150 మంది మాత్రమే ఆడవాళ్లు ఉన్నారని.. వాళ్లకు కూడా అన్నం పెట్టి బట్టలు ఇవ్వలేమా అని అడిగారు. దర్శకనిర్మాతలు తెలుగు ఆర్టిస్ట్ లను ప్రోత్సహించాలని, మన అక్క చెల్లెల్ని వేరే చోట చూడొద్దని అన్నారు.

దర్శకనిర్మాతలు తెలుగు వాళ్లకు అవకాశాలు ఇవ్వాలని.. కావాలంటే మీ కాళ్లకు దండం పెడతా ప్లీజ్ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. 'మా' అధ్యక్షుడు నరేష్ ఆధ్వర్యంలో అంతా మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నామని.. ఇలానే మరింత ముందుకు వెళ్తామని అన్నారు.