నటిగా, డాన్స్ కొరియోగ్రాఫర్ గా గాయత్రి రఘురాం గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ తమిళ్ రియాలిటీ షోలో కూడా పాల్గొంది. అయితే శనివారం అర్ధరాత్రి మద్యం ఆమె మత్తులో కారు నడుపుతూ పోలీసులకు పట్టుబడి వారితో గొడవకి దిగిందని, రూ.3,500 ఫైన్ కూడా చెల్లించినట్లు ప్రచారం జరిగింది.

పోలీసులు ఆమెకి బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించగా ఆమె మద్యం సేవించినట్లు కన్ఫర్మ్ అయిందని ప్రచారం జరిగింది. ఈ వ్యవహారంపై స్పందించిన గాయత్రి రఘురాం వెర్షన్ మరో రకంగా ఉంది. కావాలనే తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, వాటికంటే తనకు ఆత్మాభిమానం, జీవితమే ముఖ్యమని వెల్లడించింది.

''నిజానికి జరిగిందేంటంటే శనివారం రాత్రి షూటింగ్ ముగించుకొని సహ నటీనటులను వారి ఇంటికి చేర్చాను. తరువాత ఒంటరిగా కారులో మా ఇంటికి వెళ్తుండగా.. ట్రాఫిక్ పోలీసులు సాధారణ సోదాలు జరిపారు.

నా డ్రైవింగ్ లైసెన్స్, కార్ కి సంబంధించిన పేపర్స్ వేరే జేబులో ఉండిపోవడంతో వాటిని పోలీసులకు చూపించలేకపోయాను. అయినా నేను మద్యం మత్తులో ఉంటే పోలీసులు ఎలా కారు నడపడానికి అనుమతిస్తారు..? నా గురించి ఎలాంటి  ప్రచారం జరిగినా నేను భయపడను'' అంటూ చెప్పుకొచ్చింది.