ఇటీవల వరుసగా సినీ ఇండస్ట్రీకి చెందిన యువ నటీనటుల మరణ వార్తలు అందరినీ దిగ్బ్రాంతికి గురిచేస్తున్నాయి. మొన్న బెంగాలీ నటి ఆత్మహత్య మరవక ముందే తాజాగా మరో నటి కన్నుమూయడం బాధాకలిగిస్తోంది. 

కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. యువ నటి చేతన రాజ్ మరణించడం పట్ల అందరూ షాక్ కు గురవుతున్నారు. సినీ ఇండస్ట్రీలో వరుస మరణ వార్తలను సినీ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా కన్నడ టీవీ యాక్ట్రస్ చేతన రాజ్ (Chethana Raj) మృతి చెందడంతో ఆమె కుటుంబీకులు, స్నేహితులు, సన్నిహితులు చింతిస్తున్నారు. అయితే నటి చేతన రాజ్ (21) బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. ఇందుకోసం నిన్న (మే 16)న ఉదయం ఆసుపత్రిలో చేరి ‘ఫ్యాట్ ఫ్రీ’ శస్త్రచికిత్స చేయించుకున్నారు.

అయితే సర్జరీ తర్వాత నటి ఆరోగ్య పరిస్థితి మారుతూ వచ్చింది. తన ఊపిరితిత్తులలో నీరు చేరడం మూలంగా సాయంత్రం సమయంలో ఆమె ఆరోగ్యంలో క్షీణించడం ప్రారంభమైంది. దీంతో ఈ రోజు తుది శ్వాస విడిచింది. మరోవైపు, శస్త్రచికిత్స వికటించడం వల్లే చేతన మృతి చెందిందని, ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. డాక్టర్లు తన ఆరోగ్య పరిస్థితిని తెలియజేయలేదని, అలాగే చేతన తన స్నేహితులతో మాత్రమే ఆసుపత్రికి వెళ్లిందని పలు రిపోర్ట్ తెలుపుతున్నాయి.

చేతన మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు వాదిస్తున్నారు. చేతన మృతదేహం ప్రస్తుతం ఆసుపత్రిలో ఉంది. పోస్ట్ మార్టం కోసం నగరంలోని రామయ్య ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి కమిటీకి వ్యతిరేకంగా చేతన సంబంధికులు సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటికే బెంగాలీ నటి పల్లవి డే ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.