కోరలు చాచిన కరోనా నటులపై పంజా విసురుతుంది. ఇప్పటికే అనేక మంది ప్రముఖులు కరోనా బారినపడడం జరిగింది. కొరోనా కారణంగా కొందరు ప్రాణాలు కోల్పోగా కొందరు కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చారు. తాజాగా బెంగాలీ పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు దాదా సాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత సౌమిత్ర ఛటర్జీ కరోనా కారణంగా విషమ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 

కొద్దిరోజుల క్రితం అనారోగ్యం పాలైన సౌమిత్ర ఛటర్జీకి కరోనా పరీక్షలు నిర్వహించగా ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. దీనితో కలకత్తా లోని బెల్లే వ్యూ క్లినిక్ లో చేర్చి వైద్యం అందిస్తున్నారు. దాదాపు 20 రోజులుగా సౌమిత్ర ఛటర్జీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా, ఆయన ఆరోగ్యం విషమించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. 

ఆయన గుండె, ఊపిరి తిత్తుల పనితీరు బాగున్నప్పటికీ బ్రెయిన్ సరిగా పనిచేయడం లేదని డాక్టర్స్ వెల్లడించారు. దీనితో సౌమిత్రా ఛటర్జీ ప్రస్తుతం స్పృహలో లేరని తెలుస్తుంది. ఆయన బ్లడ్ లో ప్లేట్ లెట్స్ శాతం గణనీయం తగ్గిపోయిందట. హిమో గ్లోబిన్ శాతం తగ్గిపోవడంతో పాటు యూరియా, సోడియం శాతం ప్రమాదకర స్థాయికి చేరినట్లు డాక్టర్స్ తెలియజేయడం జరిగింది. 

న్యూరాలజిస్ట్స్ మరియు నెఫ్రాలజిస్ట్స్ టీమ్ సమావేశమై ఆయన తదుపరి చికిత్సా విధానం పై నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. ప్లాస్మా మార్పిడి ద్వారా మాత్రమే సౌమిత్రాను  కాపాడగలం అని వైద్యులు భావిస్తున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యుల అనుమతితో సౌమిత్రా కు చికిత్స అందించనున్నట్లు వైద్యులు తెలిపారు.