2019 ఎన్నికల్లో 'జనసేన' పార్టీ ఘోర పరాజయం పాలైంది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. దీంతో జనసైనికులు నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలో నటుడు రాజశేఖర్ పవన్ కళ్యాణ్ పై తన జాలి చూపించాడు. ఇటీవల జీవిత రాజశేఖర్ దంపతులు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో జగన్ గెలవడంతో ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ శుభాకాంక్షలు చెప్పారు.

ఈ క్రమంలో రాజశేఖర్.. పవన్ గురించి ప్రస్తావించారు. చాలా మంది 'మా' ఎన్నికల్లో నాగబాబు మీకు సపోర్ట్ చేశారు కదా.. మరి ఎన్నికల్లో ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అందరూ అడుగుతున్నారని, తను నాగబాబుగారి నియోజకవర్గానికి వెళ్లి వ్యతిరేకంగా ప్రచారం చేయలేదని అన్నారు.

అలానే భీమవరం నియోజకవర్గానికి కూడా వెళ్లలేదని, గాజువాక మాత్రం వెళ్లాల్సి వచ్చిందని, అది పార్టీ నుండి వచ్చిన ఆదేశమని అన్నారు. తనకు పవన్ కళ్యాణ్ పై ఎలాంటి కోపం, వ్యతిరేకత లేదని అన్నారు. పవన్ పార్టీ పెట్టిన ఇన్నేళ్లలో తను ఒక్క కామెంట్ కూడా చేయలేదని, కానీ కర్మ అనుసారం గాజువాకలో ప్రచారం చేయాల్సి వచ్చిందని అన్నారు. అంతే తప్ప ఏదీ ప్లాన్ చేసి చేయలేదని అన్నారు.

ప్రజారాజ్యం సమయంలో తనకు, చిరంజీవికి మధ్య ఏర్పడిన విబేధాలు క్లియర్ అవ్వడానికి ఇంత కాలం పట్టిందని, ఇప్పుడు పవన్ విషయంలో ట్రోల్ చేయకండని అన్నారు.  ఎలాంటి గొడవల్లో ఉండాలని అనుకోవడం లేదని, పార్టీ కోసం ప్రచారం చేశానని అన్నారు.

ఫలితాల తరువాత పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా అతడిని చూసి జాలేసిందని అన్నారు. ఆయన ఒక్క సీటైనా గెలిచి ఉండుంటే బావుండేదని అన్నారు. భీమవరంలో ఆయన గెలుస్తారని అనుకున్నట్లు కానీ గెలవలేదని అన్నారు.