త్వరలో జరగబోయే 'మా' ఎన్నిక రసవత్తరంగా మారుతోంది. గత కొన్ని వారాలుగా మా ఎన్నికల నేపథ్యంలో టాలీవుడ్ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

త్వరలో జరగబోయే 'మా' ఎన్నిక రసవత్తరంగా మారుతోంది. గత కొన్ని వారాలుగా మా ఎన్నికల నేపథ్యంలో టాలీవుడ్ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక వైపు ప్రకాష్ రాజ్ ప్యానల్.. మరో వైపు మంచు విష్ణు ప్యానల్ పొలిటికల్ స్ట్రాటజీస్ తో దూసుకుపోతున్నారు. 

డిన్నర్ మీటింగులు, పార్టీల పేరుతో ఇరు వర్గాలు ఆర్టిస్టులని ఆకర్షిస్తున్నారు. మొదట్లో ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అనే విమర్శలు ఎదుర్కొనప్పటికీ ప్రస్తుతం అతడికి మద్దతు బాగానే పెరిగింది. మరో వైపు మంచు విష్ణు సినీ పెద్దలని ప్రసన్నం చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. అధ్యక్ష పదవి కోసం వీరిద్దరూ పోటీ పడుతుండగా.. ఇతర పదవులకు కూడా గట్టి పోటీ నెలకొని ఉంది. అందులో జనరల్ సెక్రటరీ పదవి ఒకటి. 

ఇప్పటికే జనరల్ సెక్రటరీ పదవి కోసం ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి జీవిత బరిలో నిలిచారు. ఆమె రాకతో అలిగిన బండ్ల గణేష్.. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి బయటకు వచ్చి అదే పదవి కోసం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. జీవిత, బండ్ల గణేష్ మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. 

వీరిద్దరికి పోటీగా జనరల్ సెక్రటరీ పదవి కోసం విష్ణు తన ప్యానల్ నుంచి ప్రముఖ నటుడ్ని బరిలోకి దించుతున్నాడు. అతడు ఎవరో కాదు టాలీవుడ్ లో కమెడియన్ గా, విలన్ గా రాణిస్తున్న రఘుబాబు. రఘుబాబుని జనరల్ సెక్రటరీ పదవి కోసం పోటీలోకి దింపేందుకు విష్ణు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. దీనితో ఈసారి మా ఎన్నికల్లో మాస్ ఫైట్ తప్పదని అంటున్నారు.

మరో ఆసక్తికర వార్త ఏంటంటే మంచు విష్ణు ప్యానల్ నుంచే సీనియర్ కమెడియన్ బాబు మోహన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా బరిలోకి దిగబోతున్నారు. బాబు మోహన్ సినీ రంగంలోనూ, రాజకీయాల్లోనూ రాణించారు. 

`మా` 2021-23 ఎన్నికల నోటిఫికేషన్‌ శుక్రవారం విడుదలైంది. అక్టోబర్‌ 10న ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నాం 2 గంటల వరకూ జూబ్లీ పబ్లిక్‌ స్కూల్‌లో పోలింగ్‌ జరగనున్నట్లు ఎన్నికల అధికారి వి.కృష్ణమోహన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. 

ఎనిమిది మంది ఆఫీస్‌ బేరర్స్‌, 18మంది ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబర్‌తో కూడిన ఈ ఎన్నికలకు ఈ నెల 27 నుంచి 29 వరకూ నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. 30న నామినేషన్ల పరిశీలన జరుగుతుందని, నామినేషన్‌ ఉపసంహరణకు వచ్చే నెల 1,2 తేదీల్లో సాయంత్రం 5 గంటల వరకూ గడువు ఉంటుందని వెల్లడించారు.