దర్శకధీరుడు రాజమౌళిని ఉద్దేశిస్తూ నటుడు భానుచందర్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి మట్టిని చాక్లెట్ అని చెప్పి అమ్మగల దిట్ట, పెద్ద మార్కెట్ మేధావి అంటూ కొనియాడారు.  

ఆర్ ఆర్ ఆర్ మూవీతో రాజమౌళి (Rajamouli) మరో బ్లాక్ బస్టర్ నమోదు చేశారు. తెలుగులో ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. బాహుబలి 2 రికార్డ్స్ కూడా బ్రేక్ చేసింది. హిందీలో రూ. 250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఆర్ ఆర్ ఆర్ ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)విజయంతో దర్శకుడు రాజమౌళి పేరు మరోసారి దేశంలో మారుమ్రోగుతుంది. ఆయన టేకింగ్, మేకింగ్ గురించి ప్రేక్షకులు, సినీ ప్రముఖులు ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో సీనియర్ నటుడు భానుచందర్ రాజమౌళి గొప్పతనాన్ని తనదైన శైలిలో వివరించారు. 

ఆయన మాట్లాడుతూ‘రాజమౌళి దేశం గర్వించదగ్గ దర్శకుడు అవుతాడని 12 ఏళ్ల క్రితేమ చెప్పాను. ఇప్పుడు అదే జరిగింది. సింహాద్రి సినిమా చేసినప్పుడే రాజమౌళితో ఈ మాట చెప్పాను. నా డబ్బింగ్‌ సమయంలో ఆయనను పిలిచి ఈ సినిమా తర్వాత నేను మీకు ఫోన్‌ చేస్తాను. కానీ మీరు అందుబాటులోకి రారు. సినిమా చాలా పెద్ద హిట్‌ అవుతుంది. మీరు దేశం గర్వించే గొప్ప దర్శకులు అవుతారు’ అని చెప్పాను. అంతేకాదు ఆయన దగ్గరి నుంచి సినిమాను ఎలా ప్రమోట్‌ చేయాలి, ఎలా హిట్‌ చేయాలనే టెక్నిక్‌ను చాలామంది నేర్చుకోవాలి. రాజమౌళి మట్టిని చాక్లెట్‌ పేపర్‌లో పెట్టి వండర్‌ఫుల్‌ చాక్లెట్‌ అని అమ్మగలరు. ఇలా ఎంతమంది చేయగలరు. ఎవరు పడితే వాళ్లు చేయలేరు. దానికి ప్రత్యేక నైపుణ్యం ఉండాలి. అది రాజమౌళిలో చాలా ఉంది” అని ఆయన అన్నారు.

రాజమౌళి గొప్ప దర్శకుడే కాకుండా మార్కెటింగ్ జీనియస్. తన చిత్రాన్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలో రాజమౌళికి బాగా తెలుసని భానుచందన్ వెల్లడించారు. భాను చందర్ మాటల్లో నూటికి నూరు శాతం నిజం ఉంది. సినిమాను ఎలా జనాల్లోకి తీసుకెళ్లాలి, హైప్ తేవాలనే విషయాలు రాజమౌళి బాగా తెలుసు. బహుబలి 1 హిట్ తర్వాత ''కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?'' అనే ఓ సస్పెన్స్ క్రియేట్ చేసి, ప్రతి ఒక్కరు మాట్లాడుకునేలా చేశారు.

ఫస్ట్ పార్ట్ కి పదిరెట్లు విజయం బాహుబలి 2 సాధించడం వెనుక రహస్యం కూడా ఇదే. సినిమా మేకింగ్ మించి ప్రమోషన్స్ కి ఆయన కష్టపడతారు. ఆర్ ఆర్ ఆర్ కోసం రోజుల తరబడి తన ఇద్దరు హీరోలతో రాజమౌళి దేశంలోని అనేక నగరాల్లో పర్యటనలు చేశారు. కాగా నటుడు భానుచందర్(Bhanu Chander) సింహాద్రి మూవీలో హీరోయిన్ భూమిక తండ్రి పాత్ర చేశారు. రాజమౌళి రెండవ చిత్రంగా విడుదలైన సింహాద్రి ఆయనకు ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. ఎన్టీఆర్ (NTR) కెరీర్ లో అతిపెద్ద విజయంగా నిలిచిపోయింది. ఎన్టీఆర్ కి మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టిన చిత్రాల్లో ఇది కూడా ఒకటి.