నటుడు బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. నీచుల్లారా పరువు తీస్తున్నారంటూ ఆవేశం వ్యక్తం చేశారు.  

విషయం ఏదైనా బండ్ల గణేష్ ముక్కుసూటిగా మాట్లాడతారు. ఆయనలో నచ్చిన అంశం అదే. తాజాగా ఎన్ఆర్ఐ ల మీద మండిపడ్డారు. అమెరికా వేదికగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు బాలకృష్ణ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాగా తానా సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్నారు. అందరి ముందే ఒకరి వర్గంపై మరొక వర్గం పిడిగుద్దులు కురిపించుకున్నారు. 

తానా వేడుకల్లో జరిగిన ఈ కుమ్ములాటల వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఘర్షణను ఉద్దేశిస్తూ బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు. ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పరువు తీస్తున్నారు. తానాను నిర్మించడానికి మన జాతి పెద్దలు ఎంతో కృషి చేశారు. వాళ్ళ కష్టాన్ని మీరు గంగపాలు చేస్తున్నారు, నీచుల్లారా అని బండ్ల గణేష్ కామెంట్ చేశాడు. ఆయన ట్వీట్ వైరల్ అవుతుంది. 

Scroll to load tweet…

విశ్వనీయ సమాచారం ప్రకారం బాలయ్య, ఎన్టీఆర్ వర్గాల మధ్య ఈ ఘర్షణ చోటు చేసుకుంది. బాలయ్య వర్గాన్ని రెచ్చగొట్టేలా ఎన్టీఆర్ వర్గం నినాదాలు చేసిన క్రమంలో ఇరు వర్గాలు దాడికి దిగారని తెలుస్తుంది. ఏపీలో నందమూరి అభిమానులు రెండుగా చీలిపోయిన విషయం తెలిసిందే. పలు సందర్భాల్లో బాలయ్య ఫ్యాన్స్, టీడీపీ వర్గాలు ఎన్టీఆర్ ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో అవమానకర పోస్ట్స్ పెడుతున్నారు. 

సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు హైదరాబాద్ వేదికగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ హాజరుకాలేదు. ఈ విషయంలో ఎన్టీఆర్ ని బాలయ్య ఫ్యాన్స్ తో పాటు టీడీపీలోని చంద్రబాబు, లోకేష్ వర్గం టార్గెట్ చేశాయి. ఈ క్రమంలో నందమూరి ఫ్యాన్స్ మధ్య అంతర్గత పోరు జరిగింది. ఒక దశలో బాలయ్య ఫ్యాన్స్ చరణ్ ని ఆకాశానికి ఎత్తుతూ, ఎన్టీఆర్ ని తక్కువ చేస్తూ పోస్ట్స్ పెట్టారు. దీని తాలూకు అసహనం తానా వేడుకల్లో కనిపించింది.