ఈ వారానికి గాను హౌస్ నుండి  మెహబూబ్ ఎలిమినేట్ కావడం జరిగింది. నామినేటైన ఆరుగురు ఇంటి సభ్యులలో అతి తక్కువ ఓట్లు పొందిన మెహబూబ్ ఎలిమినేటయ్యాడు. బిగ్ బాస్ హౌస్ లో సీక్రెట్ రూమ్ లో వారం రోజులుగా ఉంటున్న అఖిల్ ని హౌస్ లోకి ప్రవేశపెట్టాడు బిగ్ బాస్. నిన్న సోమవారం కావడంతో నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. 

నామినేషన్స్ ప్రక్రియలో అభిజిత్ మరియు అఖిల్ మధ్య వాగ్వాదం జరిగింది. సీక్రెట్ రూమ్ లో ఉంటూ అభిజిత్ ప్రవర్తన గమనించిన అఖిల్ అతని పట్ల అసహనంతో ఉన్నాడు. అభిజిత్ అఖిల్ కి మిత్రుడుగా ఉంటూ, హౌస్ నుండి వెళ్ళిపోయిన తరువాత చేసిన వ్యాఖ్యలు అఖిల్ గమనించాడు. ఇక హౌస్ కెప్టెన్ గా మారిన అఖిల్ అభిజిత్ తో గొడవకు దిగాడు. 

తాను మేకలా బయటికి వెళ్లి పులిలా తిరిగి వచ్చానని అఖిల్ అభిజిత్ తో అన్నాడు. దానికి అభిజిత్ మేక బలి అవుతుంది, పులి కాదని అన్నాడు. ఇంత జరిగినా నీకు బుద్ది రాలేదని అభిజిత్ అఖిల్ ని అన్నాడు. లోపలికి మళ్ళీ వస్తాననే కాన్ఫిడెన్స్ తోనే నువ్వు బయటికి వెళ్ళావు అన్నాడు. ఎనిమిది కోట్ల ప్రేక్షకుల ముందు మాట్లాడాను, నీ ముందు మాట్లాడడానికి భయపడతానా, నువ్వు ఆఫ్ట్రాల్, బచ్చాగానివి అని అఖిల్ పై ఘాటు విమర్శలు చేశాడు అభిజిత్. 

అభిజిత్ మాటలకు అదే రీతిలో అఖిల్ సమాధానం చెప్పాడు. తాజా ప్రోమోలో వీరి మధ్య వివాదం తారా స్థాయికి చేరినట్లు అర్థం అవుతుంది. మోనాల్ ని కూడా వదిలేసి అభిజిత్ కి దగ్గరైన అఖిల్ తాజా పరిణామాల నేపథ్యంలో అతనికి శత్రువుగా మారాడు.