దక్షిణాది దర్శకులు భారీ బడ్జెట్ సినిమాలు తీయడంలో బాలీవుడ్ దర్శకులతో పోటీ పడుతున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జక్కన్న బాహుబలి మూవీ... రెండో భాగం బాహుబలి 2 తో కలిపి 300 కోట్ల వరకు నిర్మాణ వ్యయం అయింది. ఇక తమిళ దర్శకుడు శంకర్ భారీ సినిమాలకు కేరాప్ అడ్రస్. తన డ్రీమ్ ప్రాజెక్ట్ రోబో2 కోసం దాదాపు 350 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు ఇదే కోవలో రామ్ గోపాల్ వర్మ కూడా 350 కోట్లతో భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కిస్తానని ప్రకటించాడు. ఇలా దక్షిణాది దర్శకులు 300 కోట్లకు తగ్గకుండా భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తున్నారు.
బాహుబలి రెండు భాగాలు కలిపి 250 కోట్ల బడ్జెట్ అంటే... మనకంత మార్కెట్ ఉందా అని భయపడ్డారు. తొలి భాగం 100 కోట్ల ఖర్చుతో తెరకెక్కింది. రెండవ భాగానికి 150 కోట్లు ఖర్చు చేసారు. అయితే రాజమౌళి అండ్ టీమ్ అమలు చేసిన ప్రమోషన్ ప్లాన్ , వర్క్ అవుట్ అయ్యి తొలి భాగం దాదాపు 500 కోట్లు కొల్లగొట్టింది.రెండవ భాగం 1000 కోట్లు కొల్లగొట్టడం ఖాయం అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే దక్షిణాదిన ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మరో సినిమా రోబో2.
తమిళ దర్శకుడు కర్ భారీ తనం తెల్సిందే. అందులోనూ రోబో అంటే ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్. అందుకే ఈ సినిమాను ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడని సమాచారం. దాదాపు 350 కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం వేసిన సెట్టే దాదాపు 100 కోట్లు ఉంటుందని సమాచారం. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాని శంకర్.. రోబో 2 గ్రాఫిక్ వర్క్ కోసం అనేక అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వచ్చే ఏడాది దీపావళికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఇక ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ కూడా హైబడ్జెట్ మూవీస్ లిస్ట్ లో చేరిపోయాడు. తన కొత్త చిత్రం న్యూక్లియర్ ను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నాడు.350 కోట్లను ఈ సినిమా కోసం ఖర్చుచేస్తున్నారట. హాలీవుడ్ లో రిలీజ్ కానున్న ఈ చిత్రం పై అప్పుడే భారీ అంచనాలు మొదలయ్యాయి.
నిజానికి దక్షిణాది సినిమా బాక్సాఫీస్ వద్దే 100 కోట్ల కొల్లగొట్టడం కష్టం. అలాంటిది సినిమా నిర్మాణాలకే 200 కోట్లు, 350 కోట్లు అంటే.. భారీ సాహసం అనే చెప్పాలి. అయితే కంటెంట్ ఉండి , కథలో యూనివర్సల్ అప్పీల్ ఉంటే.. బాహుబలి సినిమాలా బాక్సాఫీస్ 500 కోట్లు కొల్లగొట్టడం పెద్ద విషయం కాదు. అందుకే బాలీవుడ్ దర్శకులు కూడా సాహసించని విధంగా.. దక్షిణాది టాప్ దర్శకులు ఈ రేంజ్ లో భారీ బడ్జెట్ తో సినిమాలు నిర్మిస్తున్నారు.
