2.0 రిలీజ్ కు చిత్ర యూనిట్ అంతా సిద్ధం చేసుకుంది. ప్రేక్షకులు కూడా ముందుగా అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకొని 29వ తేదీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రతి పెద్ద సినిమాకు ఎదో ఒక వివాదం ఆరోపణలు రావడం సహజమే. అయితే 2.0 కు అలాంటి సమస్యలు ఏమి లేవని అనుకుంటున్నా తరుణంలో ఊహించని విధంగా టెలికం ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాజ్యాంగానికి విరుద్ధం అంటూ సెల్యూలార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) సెన్సార్ బోర్డుకి - సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలకు ఈ నెల 23న ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. సైన్స్ పై తప్పుడు ఆలోచన రేకెత్తించేలా ఉన్న ఈ సినిమాకు జారీ చేసిన సెన్సార్ సర్టిఫికెట్ ను వెనక్కి తీసుకోవాలని చెబుతూ మొబైల్ ఫోన్లు,  టవర్లు పశుపక్ష్యాదులకు మానవాళికి ప్రమాదకరం అనే విషయాలను సినిమాలో చుపించారాని అందుకే సినిమా విడుదలను అడ్డుకోవాలని సీవోఏఐ ఫిర్యాదులో పేర్కొంది.

అదే విధంగా సిబిఎఫ్ సి కి కేంద్ర ప్రభుత్వానికి ఈ సినిమా యూనిట్ వివరణ ఇచ్చే వరకు సినిమాను విడుదల చేయడం కరెక్ట్ కాదని చెబుతూ సినిమా ప్రజల ఆలోచన విధానంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అని పేర్కొన్నారు. ఈ విషయంపై ఇంకా చిత్ర యూనిట్ స్పందించాల్సి ఉంది. 

సినిమాలో ఒక గ్లోబల్ మెస్సేజ్ ఉందని దర్శకుడు శంకర్ నిన్న జరిగిన ప్రెస్ లో తెలిపారు. ఇక మొబైల్స్ కు మనిషి ఎలా బానిస అయ్యాడు వాటి వల్ల ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనే ఎన్నో అంశాలను సినిమాటిక్ గా చూపించనున్నారు. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించింది.