ప్రస్తుతం ఆర్ఆర్ఆర్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్న యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్, ఈ సినిమా తరువాత చేయబోయే ప్రాజెక్ట్‌ను ఇప్పటికే కన్‌ఫార్మ్‌ చేశాడు. గతంలో తనకు అరవింద సమేత వీర రాఘవ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో నెక్ట్స్ సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు తారక్‌. ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబర్‌లోనే ప్రారభించాలన భావించారు. కానీ కరోనా కారణంగా ఆర్ఆర్‌ఆర్‌ షూటింగ్ కు బ్రేకులు పడటంతో ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే ఇప్పటికే కథా కథనాలు ఫైనల్‌ గా అయిన ఈ సినిమాకు సంబంధించిన ఇతర ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే నటీనటుల ఎంపిక కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా బాలీవుడ్ క్రేజీ బ్యూటీ జాన్వీ కపూర్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్‌, ఎన్టీఆర్ట్స్ పతాకాలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్‌ తెర మీదకు వచ్చింది. ఈ సినిమాలో కీలకమైన సెకండ్‌ హీరో పాత్రకు ఓ యంగ్ హీరోను తీసుకోవాలని భావిస్తున్నారు. ఆర్‌ ఎక్స్‌ 100 ఫేం కార్తికేయ, లేదా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేం నవీన్‌ పొలిశెట్టిల్లో ఒకరిని ఆ పాత్రకు తీసుకోవాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

గతంలోనూ తన సినిమాలో సెకండ్‌ హీరో పాత్రలో మంచి పేరున్న నటులను తీసుకున్న త్రివిక్రమ్. అజ్ఞాతవాసిలో విలన్‌గా ఆది పినిశెట్టి నటించగా, అరవింద సమేతలో నవీన్‌ చంద్రను, అల వైకుంఠపురములో సినిమాల్లో సుశాంత్‌ కీలక పాత్రలో నటించాడు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకు కూడా ఓ యంగ్ హీరోను తీసుకునే ఆలోచనలో ఉన్నాడు త్రివిక్రమ్‌.