దర్శకుడు మారుతి 'భలే భలే మగాడివోయ్' సినిమాకు ముందు బోల్డ్ సినిమాలను తీసేవాడు. దీంతో అతడిపై బూతు దర్శకుడనే ముద్ర పడింది. కానీ 'భలే భలే మగాడివోయ్' సినిమా రిలీజ్ తరువాత ఆ ముద్ర చెరిగిపోయింది.

ఈ సినిమాతో తన రూటు మార్చేసి.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. అయితే ఆ సినిమా దగదర నుండి మారుతిని ఓ సెంటిమెంట్ వెంటాడుతోంది. ఒక పెద్ద సూపర్ హిట్ ఇచ్చిన తరువాత తనపై పెట్టుకునే భారీ అంచనాలను అతడు అందుకోలేకపోతున్నాడు.

కుందనపు బొమ్మలా రాములమ్మ.. ఫోటోషూట్ అదిరింది!

'భలే భలే మగాడివోయ్' సినిమా తరువాత మారుతి తీసిన 'బాబు బంగారం' సినిమా ఫ్లాప్ అయింది. అయితే తనపై అంచనాలు తగ్గిన సమయంలో 'మహానుభావుడు'తో మళ్లీ హిట్ అందుకొని తన సత్తా చాటాడు. కానీ ఆ తరువాత భారీ అంచనాల మధ్య విడుదలైన 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా ఫ్లాప్ అయింది. ఆ తరువాత మళ్లీ అతడిపై అంచనాలు తగ్గాయి.

చాలా రోజులు గ్యాప్ తీసుకొని 'ప్రతిరోజు పండగే' సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో సాయి ధరం తేజ్ హీరోగా నటించగా.. అతడి సరసన రాశిఖన్నా హీరోయిన్ గా కనిపించనుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రోమోలు, ట్రైలర్లను బట్టి ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమని తెలుస్తోంది.

క్రిస్మస్ సెలవుల్లో మంచి టైమింగ్ చూసుకొని సినిమాని విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకి గనుక హిట్ టాక్ వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు పరుగులు తీయడం ఖాయం. మరి మారుతి సెంటిమెంట్ వర్కవుట్ అయ్యి సినిమా సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి!