బాలయ్య కుమారుడు.. దివంగత ఎన్టీఆర్ మనవడు.. మోక్షజ్ఞ లాంచింగ్ కోసం నందమూరి అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య కూడా మీడియాతో చాలా సార్లు  మోక్షజ్ఞ.. ఎంట్రీకి మంచి కథను చూస్తున్నట్లు చెప్పుకొచ్చారు. మరోవైపు  దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘ఎన్టీఆర్’ బయోపిక్‌తోనైనా ఎంట్రీ ఇస్తాడనుకొని బాలయ్య అభిమానులు ఆశించారు. కానీ అదీ జరగలేదు.

అదిగో..వచ్చేస్తున్నాడు..ఇదిగో వచ్చేస్తున్నాడు అన్నారు కానీ అవేమీ కార్య రూపం దాల్చటం లేదు. దానికి తోడు ఆ మధ్యన మోక్షజ్ఞ లావుగా ఉన్న ఫొటోలు బయిటకు రావడంతో.. ఈయన ఎంట్రీ కష్టమే అని ఓ వర్గం మీడియా ఎలుగెత్తి చాటింది. మోక్షజ్ఞకు సినిమాలంటే ఆసక్తి లేదని అన్నారు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే. బాలయ్య తలుచుకుంటే ఓ ఆరు నెలల్లో కొడుకుని కత్తిలా తయారు చేసి రంగంలోకి దించగలరనేది నిజం.  అయితే బాలయ్య తన కుమారుడు ఎంట్రీకు ఎందుకు లేట్ చేస్తున్నారు. ఎందుకు ప్రక్కన పెడుతున్నారనేది మాత్రం తేలటం లేదు. అయితే ఈ విషయమై ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ ఆసక్తికరమైన విషయం వినపడుతోంది.

తను ఫామ్ లో ఉండగా తన కొడుకు ఎంట్రీ ఇస్తే బెస్ట్ అని బాలయ్య భావిస్తున్నారట. ఎన్నో అంచనాలతో చేసిన తన తండ్రి బయోపిక్ డిజాస్టర్ అవ్వటం బాలయ్యని మానసికంగా బాధపెట్టిందిట. ఈ సిట్యువేషన్ లో తాను మళ్లీ ఓ పెద్ద హిట్ ఇచ్చి నందమూరి అభిమానులకు ఉత్సాహం తెప్పించి, అప్పుడు తన కొడుకుని రంగంలోకి దించితే అప్పుడు ఆ క్రేజ్ వేరే రకంగా ఉంటుందని భావించే లేటు చేస్తున్నారంటున్నారు.

మరో ప్రక్క మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బాలయ్య ఇప్పటికే బోయపాటి శ్రీను,క్రిష్‌తో పాటు కొరటాల శివ, త్రివిక్రమ్‌లతో స్టోరీలు రెడీ చేయిస్తున్నాడని వార్తలు వినపడుతున్నాయి. అలాగే మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ నిర్మించడానికి సాయి కొర్రపాటి, అనిల్ సుంకర, అశ్వినీదత్ వంటి నిర్మాతలు క్యూలో ఉన్నారు.