తన తండ్రి మెగా స్టార్ చిరంజీవి కోసం.. రామ్ చరణ్ తేజ్.. మళయాళ చిత్రం ‘లూసిఫర్‌’ రైట్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. తమిళ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ డైరక్టర్ గా మారి తీసిన ఈ చిత్రంలో  మోహన్‌లాల్‌ కీలక పాత్రలో నటించారు. గతేడాది విడుదలైన ఈ సినిమా అక్కడ బాక్సాఫీస్‌ వద్ద పెద్ద హిట్టైంది. 

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో  చిరంజీవి ‘ఆచార్య’లో నటిస్తున్నారు. దీని తర్వాత ‘లూసిఫర్‌’ను రీమేక్‌ చేయనున్నారు. అయితే, ఈ రీమేక్ చిత్రానికి ఎవరు డైరక్ట్ చేయాలన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు. మొదట ఈ ప్రాజెక్టుని సుకుమార్‌ చేతిలో పెడదామనుకున్నారట. అయితే ఆయన అల్లు అర్జున్‌ చిత్రంతో బిజీగా ఉన్నారు.

దాంతో  ఈ చిత్రానికి వి.వి.వినాయక్‌ అయితే, న్యాయం చేస్తారని చిరు భావించి తన కుమారునితో చెప్పారట. వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఖైదీ నంబర్‌ 150’తోనే చిరు రీఎంట్రీ ఇచ్చారు. తన మాస్‌ ఇమేజ్‌కు సరిపోయేలా ఆ సినిమాను తీర్చిదిద్దారు. కాబట్టి ఈ రీమేక్ కూడా ఆయన బాగా చేస్తారని భావిస్తున్నారు.

  కానీ, రామ్‌చరణ్‌ మాత్రం వేరేలా ఆలోచిస్తున్నారట. ఈ సినిమాకు యంగ్ డైరక్టర్ సుజీత్‌ అయితే, స్టైలిష్‌గా తీస్తారని భావిస్తున్నారట. ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన  భారీ బడ్జెట్‌ చిత్రం ‘సాహో’ను స్టైలిష్‌గా తీసి మంచి పేరు తెచ్చుకున్నారు సుజీత్‌. ఇప్పుడు ‘లూసిఫర్‌’ రీమేక్‌ కూడా ఆయన స్టైలిష్‌గా తీస్తారని రామ్ చరణ్ అంటున్నారట . అయితే తనతో పనిచేసిన అనుభవం ఉన్న వినాయక్‌ వైపు చిరంజీవి మొగ్గు చూపుతున్నారనటి టాలీవుడ్‌ టాక్‌.  సుజీత్...సాహో డిజాస్టర్ అయ్యిందని, స్టైలిష్ గా తీసినా ఫలితం లేదని, జనాలకు అర్దమయ్యేటట్లు, ఎంజాయ్ చేసేటట్లు తీసే డైరక్టర్ అయితేనే బెస్ట్ అని కొడుకుని ఒప్పించే పనిలో పడ్డారట చిరంజీవి.