హర్యానా, మహారాష్ట్ర శాసన సభ ఎన్నికలు సహా దేశవ్యాప్తంగా పలు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడైన సంగతి తెలిసిందే. ఇందులో మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్ రావ్ దేశ్‌ముఖ్ కుమారులు అమిత్ దేశ్‌ముఖ్, ధీరజ్ దేశ్‌ముఖ్ లు లాతూర్ జిల్లా నుండి ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా విలాస్ రావ్ దేశ్‌ముఖ్మరో కుమారుడు రితేష్ దేశ్‌ముఖ్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేశాడు.

జెనీలియా ప్రచారం.. విజయఢంకా మోగించిన దేశ్ ముఖ్ సోదరులు!

''మేం సాధించాం నాన్న.. వరుసగా మూడోసారి అమిత్ 40 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో లాతూర్ సిటీలో గెలుపొందగా.. ధీరజ్ లాతూర్ రూరల్ అసెంబ్లీ స్థానాన్ని లక్షా ఇరవై వేల మెజారిటీతో సొంతం చేసుకున్నాడు. లాతూర్ ప్రజలు మాపై ఉంచిన విశ్వాసానికి, నమ్మకానికి ధన్యవాదాలు'' అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

ఎన్నికల సమయంలో రితేష్ దేశ్‌ముఖ్ తన సోదరుల కోసం ప్రచారం చేపట్టాడు. లాతూర్ రూరల్, సిటీలలో రితేష్ తిరిగి తిరిగి మరీ ప్రచారం చేపట్టాడు. ధీరజ్ దేశ్‌ముఖ్ లాతూర్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో గెలుపొందడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇక్కడ ప్రత్యర్ధులైన శివసేన అభ్యర్ధి సచిన అలియాస్ రవి దేశ్‌ముఖ్ కంటే 'నోటా'కి ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఎన్నడూ లేని విధంగా నోటా రెండో స్థానంలో నిలిచింది. దీంతో లాతూర్ రూరల్ లోక్ సభ నియోజకవర్గం ఫలితాలు అందరి దృష్టిని ఆకర్షించాయి.

ధీరజ్ దేశ్‌ముఖ్ కి  1,33,161 ఓట్లు పోలవ్వగా నోటాకు ఏకంగా 27,287 ఓట్లు పోలయ్యాయి. శివసేన అభ్యర్ధి రవి దేశ్‌ముఖ్‌కు 13,335 ఓట్లు పోలయ్యాయి.