వివాదాలకు మారుపేరుగా మారిన హీరో శింబు... తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నారు. శింబు పై ఓ నిర్మాత నిర్మాతల కౌన్సిల్ లో ఫిర్యాదు చేశారు. హీరోగా, గాయకుడిగా, పాటల రచయితగా వివిధ రకాల టాలెంటులతో ఆకట్టుకునే శింబు... నిత్యం ఏదో ఇక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటారు. ఇప్పటికే కెట్టవన్, మన్మథన్, ఏఏఏ అనే పలు చిత్రాల గురించి శింబుపై అనేక ఫిర్యాదులందాయి. ఇతనికి రెడ్‌కార్డ్‌ సయితం ఇచ్చేందుకు నిర్మాతల సంఘం నుంచి నిర్ణయం తీసుకున్నారు. 

శింబు మఫ్టీ అనే ఓ కన్నడ చిత్రం రిమేక్ లో నటిస్తుండగా.. దాని షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. దానికి కారణం శింబునే అంటూ నిర్మాత మండిపడుతున్నాడు. కన్నడ చిత్రమైన మఫ్టీ రీమేక్‌ చేస్తున్న నిర్మాత జ్ఞానవేల్‌రాజా నిర్మాతల సంఘంలో ఫిర్యాదు చేశారు. అందులో శింబు సక్రమంగా షూటింగ్‌కు రాలేదని, దీంతో చిత్ర నిర్మాణ ఖర్చు భారీగా పెరిగిందని తెలిపారు. మిగతా నటీనటుల షూటింగ్‌కు అంతరాయం కలిగిందని, వీరికి అనవసరంగా నష్టపరిహారం చెల్లించాల్సి వస్తోందని తెలిపారు. మొదటి పదిరోజుల షూటింగే జరగలేదని ఆయన తన ఫిర్యాదులో తెలిపారు.

ఇదిలా ఉంటే... షూటింగ్ జరుగుతుండగానే మధ్యలో ఆగిపోయిన చిత్రాల్లో ఇది మూడోది కావడం గమనార్హం. ఇప్పటికే రెండు చిత్రాలు మధ్యలోనే ఆగిపోయాయి. మరి నిర్మాత చేస్తున్న ఆరోపణలకు శింబు ఎలా స్పందిస్తారో చూడాలి.