మాస్ చిత్రాలతో టాలీవుడ్ లో అగ్ర దర్శకుడిగా వివి వినాయక్ ఎదిగారు. మాస్ ఆడియన్స్ కు రెండన్నర గంటలపాటు వినోదాన్ని అందించడం వివి వినాయక్ శైలి. ఇటీవల వినాయక్ జోరు కాస్త తగ్గింది. వినాయక్ చివరగా తెరక్కించిన అఖిల్, ఇంటెలిజెంట్ చిత్రాలు నిరాశపరిచాయి. మధ్యలో ఖైదీ నెంబర్ 150 చిత్రం విజయం సాధించినప్పటికీ అది రీమేక్ గా తెరకెక్కిన సినిమా. 

ఇదిలా ఉండగా వినాయక్ బుధవారం రోజు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జగన్ ని తాడేపల్లి లోని క్యాపు కార్యాలయంలో కలుసుకున్నారు. జగన్ ని ప్రత్యేకంగా కలుసుకున్న వినాయక్ ఆయన్ని సన్మానించారు. ఇది ఆత్మీయ సమావేశంగా తెలుస్తోంది. 

జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వినాయక్ సన్నిహితంగా మెలుగుతున్నారు. గతంలో కొన్ని పార్టీ కార్యక్రమాలకు కూడా వినాయక్ హాజరయ్యారు. ఇప్పటికే వైఎస్ జగన్ కు పృథ్వి రాజ్, పోసాని, రాజశేఖర్ దంపతులు లాంటి సినీ ప్రముఖులు మద్దతు తెలుపుతున్న సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉండగా వివి వినాయక్ టాలీవుడ్ లో ఇప్పటి వరకు దర్శకుడిగా సత్తా చాటారు. ఇటీవల ఆయన హీరోగా అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో 'సీనయ్య' చిత్రంలో వినాయక్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. శరభ ఫేమ్ నరసింహా ఈ చిత్రానికి దర్శకుడు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది.