సినీనటుడు విశాల్‌కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. విశాల్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ సినిమా నష్టాన్ని అతనే భరించాలని న్యాయస్థానం తీర్పు చెప్పింది. విశాల్ 8.29 కోట్ల రూపాయలను నిర్మాతలకు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.

విశాల్ మాట మేరకు 44 కోట్ల రూపాయల వ్యయంతో సినిమా నిర్మించామని నిర్మాతలు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గతేడాది నవంబర్‌లో యాక్షన్ సినిమా విడుదలైంది. యాక్షన్ సినిమా కనీసం రూ.20 కోట్లు వసూలు చేయకపోతే నష్టాన్ని భరిస్తానని విశాల్ తమకు హామీ ఇచ్చారని నిర్మాతలు తెలిపారు.

చివరికి సినిమాకి నష్టాలే వచ్చాయి. వచ్చిన నష్టాల గురించి నిర్మాతలు విశాల్ తో చర్చించగా తన తదుపరి చిత్రం 'చక్ర' సినిమాని ట్రైడెంట్‌ బ్యానర్‌పైనే చేస్తానని మాట ఇచ్చాడట విశాల్.

అయితే ఇప్పుడు ఆ సినిమాని విశాల్ తన సొంత బ్యానర్ లోనే చేస్తున్నాడు అంటూ ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ సంస్థ నిర్మాతలు మద్రాస్ కోర్టును ఆశ్రయించారు. తాజాగా దీనిపైన విచారణ జరిపిన కోర్టు తీర్పును వెల్లడించింది. నష్టాలు భర్తీ చేసే విధంగా రూ.8.29 కోట్లకు విశాల్‌ గ్యారెంటీ ఇవ్వాలని న్యాయమూర్తి తెలిపారు.