అల్లు అర్జున్ వరుసగా వినోదాత్మక చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. పోరాట సన్నివేశాలు, నటన, డాన్సులు ఇలా అన్ని విభాగాల్లో బన్నీకి తిరుగులేని ప్రతిభ ఉంది. ప్రస్తుతం ఆలు అర్జున్ అల.. వైకుంఠపురములో చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకుడు. 

ఇటీవల కొంతకాలంగా బన్నీ మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగింది. సైరా చిత్రం విడుదలయ్య్యాక బన్నీ స్వయంగా మెగాస్టార్ కి సక్సెస్ పార్టీ ఇచ్చి అలాంటి ఊహాగానాలకు చెక్ పెట్టాడు. తాజాగా బన్నీపై మరో కుట్ర జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫ్లెక్సీ చూస్తే ఇలాంటి అనుమానాలే కలుగుతాయి. సోషల్ మీడియాలో ఒక హీరో అభిమానులు మరో హీరోపై వ్యతిరేక కామెంట్స్ చేయడం, మీమ్స్, మార్ఫింగ్ పోస్ట్స్ ప్రస్తుతం సాధారణంగా మారిపోయింది. 

కానీ అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా కొందరు ఓ ప్రాంతంలో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దీనిపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. 'తెలుగు సినీ ప్రేక్షకులు ఇతడిని హీరోగా పోషిస్తున్నారు. కానీ ఇతడు మాత్రం తెలుగు సినీ కార్మికుల పొట్ట కొడుతున్నాడు' అని ఆ ఫ్లెక్సీలో రాసి ఉంది. 

ఇందులో తెలుగు సినీ కార్మికులు అని కూడా రాసి ఉంది. ఈ ఫ్లెక్సీని నిజంగానే తెలుగు సినీ కార్మికులు ఏర్పాటు చేసారా లేక ఎవరైనా ఆకతాయిల పనా ఇది అనేది తేలాల్సి ఉంది. మొత్తంగా బన్నీ అభిమానులని మాత్రం ఈ ఫ్లెక్సీ కాస్త ఆందోలన కలిగించే విధంగానే ఉంది. 

స్టార్ హీరోగా కొనసాగుతున్న బన్నీ టార్గెట్ చేసి ఇలా ఫ్లెక్సీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎవరికి ఉందంటూ చర్చ జరుగుతోంది. బన్నీ నటిస్తున్న అల.. వైకుంఠపురములో చిత్రం సంక్రాంతి బరిలో నిలిచింది. జనవరి 12 అల్లు అర్జున్ అల వైకుంఠపురములో, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఢీకొనబోతుండడంతో ఆసక్తి నెలకొంది.