సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11విడుదలై టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొడుతోంది. అనిల్ రావిపూడి దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ అధికారిగా నటించాడు. 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతి ఈ చిత్రంలో పవర్ ఫుల్ రోల్ లో మెరిసింది. 

మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు'  సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుండడంతో శుక్రవారం వరంగల్ లో చిత్ర యూనిట్ సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించింది. సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్ పేరుతో జరిగిన ఈ వేడుకకు మహేష్, విజయశాంతితో పాటు చిత్ర యూనిట్ అంతా పాల్గొన్నారు. 

ఈ వేడుకలో విజయశాంతి తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. చిత్ర పరిశ్రమలో మీ బిడ్డనైన నన్ను ఎంతగా ఆదరించారో.. స్థాయికి తీసుకెళ్లారో తెలియంది కాదు. 13 ఏళ్ల క్రితం రాములమ్మ చిత్రంతో ఎంతటి గుర్తింపు తీసుకువచ్చారో.. అంతకు మించేలా సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని విజయవంతం చేశారు. 

నేనిక సినిమాలు చేయకుండదని భీష్మించుకు కూర్చున్న సమయంలో అనిల్ రావిపూడిగారూ ఈ చిత్రానికి ఒప్పించారు. అనిల్ రావిపూడి చెప్పిన కథ నచ్చింది.. చేశా.. హిట్ కొట్టామని కూడా తెలియజేస్తున్నా. మాములమ్మ పాత్ర తరహాలో భారతి పాత్ర కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోతుంది. కొందరు నా అక్క చెల్లెళ్లయితే ఏందీ రాములమ్మా.. మళ్ళి ఏడిపించావు అని అంటున్నట్లు విజయశాంతి తెలిపింది. బలమైన పాత్ర దొరికితే నటన కొనసాగిస్తానని విజయశాంతి అన్నారు.