విజయశాంతి నటిగా రీఎంట్రీ ఇస్తుండడంతో సరిలేరు నీకెవ్వరు చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆమె ఈ చిత్రంలో ప్రొఫెసర్ గా కనిపించబోతున్నారు. ఇటీవల దీపావళి కానుకగా చిత్ర యూనిట్ విజయశాంతి లుక్ ని రిలీజ్ చేశారు. విజయశాంతి పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. 

చాలా కాలం తర్వాత నటిగా మహేష్ బాబు సినిమాతోనే రీ ఎంట్రీ ఇవ్వడానికి గల కారణాన్ని విజయశాంతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరించారు. వాస్తవానికి కొన్నేళ్ల క్రితం నేను రుద్రమదేవి చిత్రంలో నటించాలని అనుకున్నా. నా సొంత ప్రొడక్షన్ లోనే ఆ సినిమా చేయాలని అనుకున్నాం. 

కానీ అప్పటి రాజకీయ కారణాల దృష్ట్యా రుద్రమదేవి చిత్రంలో నటించడం వీలు కాలేదు. నాకు నచ్చిన పాత్ర వస్తేనే సినిమాల్లో నటించాలని అనుకున్నా. మొదట అనిల్ రావిపూడి సరిలేరు నీ కెవ్వరు కథ నాకు చెప్పినప్పుడు 2 గంటలపాటు పొట్ట చెక్కలయ్యేలా నవ్వా. మరోమారు నా పాత్ర గురించి చెప్పించుకుని విన్నా. నా రీ ఎంట్రీకి ఇదే సరైన చిత్రం అనిపించింది. అందుకే ఓకే చేశా అని విజయశాంతి తెలిపారు. 

సినిమాల్లో నటిస్తున్నప్పటికీ తన ప్రాధానత్య రాజకీయాలకే అని ఆమె అన్నారు. రాజకీయాల్లో కొనసాగుతూనే సినిమాల్లో నటిస్తా. అది కూడా నచ్చిన పాత్ర దొరికితేనే అని విజయశాంతి అన్నారు. 

అనిల్ రావిపూడి దర్శత్వంలో తెరక్కుతున్న సరిలేరు నీకెవ్వరు చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.