అనిల్ రావిపూడి దర్శత్వంలో తొలిసారి మహేష్ బాబు నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. మహేష్ బాబు సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. విజయశాంతి ప్రొఫెసర్ గా కీలక పాత్రలో నటిస్తోంది. విజయశాంతి రీఎంట్రీ మూవీ కావడంతో సరిలేరు నీకెవ్వరు చిత్రంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

ఓ ఇంటర్వ్యూ విజయశాంతి మాట్లాడుతూ.. ఈ చిత్రంలోప్ నాకు మహేష్ బాబుకు మధ్య పోటాపోటీగా సవాల్ చేసుకునే సన్నివేశాలు ఉంటాయని అనుకుంటున్నారు. అలాంటిది ఏమీ లేదు. కొడుకుదిద్దిన కాపురం చిత్రంలో మహేష్ బాబుని చైల్డ్ ఆర్టిస్ట్ గా చూశా, నేను అప్పుడు చెప్పిన విషయాలే నిజమయ్యాయి. 

క్రికెట్ లో సచిన్ చిన్ననాటి నుంచే సంచలనంగా మారారు. సినిమాల్లో మహేష్ కూడా అంతే. ఇప్పుడు మహేష్ టాలీవుడ్ లో సూపర్ స్టార్. సెట్స్ లో మహేష్ ని నేను గమనించా. వాళ్ళ నాన్న లాగే ఎక్కువగా మాట్లాడాడు. మేమిద్దరం కలసి 50 రోజులు ఈ చిత్రం కోసం పనిచేశాం. 

మహేష్ బాబు నన్ను అమ్మ అని కానీ, మేడం అని కానీ పిలిచేవాడు. నేను మహేష్ అనే పిలిచా. సరిలేరు నీకెవ్వరు చిత్రం తర్వాత నటించే సినిమాల గురించి ఇంకా ఏమీ అనుకోలేదు. మంచి ఆఫర్లు వస్తే చేద్దామనే ఉద్దేశం మాత్రం ఉంది అని విజయశాంతి చెప్పుకొచ్చారు. 

విజయశాంతి వెండితెరకు దూరమై దాదాపు 13 ఏళ్ళు గడుస్తోంది. గ్లామర్, లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో విజయశాంతి లేడీ సూపర్ స్టార్ గా ఎదిగారు. ప్రస్తుతం ఆమె రాజకీయాల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 

సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.