తమిళ స్టార్ హీరో విజయ్ కి కోలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనంటే ప్రాణమిచ్చే అభిమానులు ఉన్నారు. విజయ్ కూడా తన అభిమానుల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తుంటాడు. తన అభిమానులకు ఏదైనా అవసరం వస్తే వెంటనే స్పందిస్తాడు. తనే స్వయంగా వెళ్లి అభిమానుల దగ్గరకి వెళ్లి వారి బాగోగులు తెలుసుకున్న సందర్భాలు ఉన్నాయి.

విజయ్ గురించి తెలిసిన ప్రతీ ఒక్కరూ ఆయన ఎంతో సౌమ్యంగా, ఒదిగి ఉండే మనస్తత్వం గల మనిషని చెబుతుంటారు. అలాంటిది విజయ్ పై సామి అనే తమిళ దర్శకుడు చేస్తోన్న ఆరోపణలు వైరల్ అవుతున్నాయి. విజయ్ తన అభిమానుల విషయంలో కర్కశంగా వ్యవహరిస్తుంటారని.. తన అభిమానులపై చూపించే ప్రేమంతా నాటకమేనని షాకింగ్ కామెంట్స్ చేశారు.

అభిమానులను కలిసిన తరువాత వారికి హ్యాండ్ షేక్ ఇచ్చి డెటాల్ తో తన చేతులు శుభ్రం చేసుకుటాడని.. అభిమానులపై ప్రేమ ఉన్నట్లు విజయ్ నటిస్తున్నారని అన్నారు. అతడు సినిమాల్లో నటించడం ఆపాలని, ఈవెంట్స్ లో అనవసరమైన విషయాలు మాట్లాడతారని, అలాంటి మాటలు ఆయన తగ్గించుకోవాలని అన్నారు. కోట్లాది మంది అభిమానులు ఉన్న విజయ్ పై ఈ రకమైన కామెంట్స్ చేయడం షాకింగ్ గా మారింది.

అయితే దర్శకుడు సామి తనకు విజయ్ కి మధ్య ఏం జరిగిందనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. నిజానికి విజయ్ ఈవెంట్ లలో ఎక్కడా తప్పుగా మాట్లాడింది లేదు. ఇటీవల ఆయన నటించిన 'బిగిల్' సినిమా ఆడియో లాంచ్ లో మాత్రం ఏ హీరో ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో ఒకరినొకరు తిట్టుకోకూడదని అన్నారు. తనపై కోపం ఉంటే నేరుగా పరిష్కరించుకోవాలని, తన ఫ్యాన్స్ జోలికి మాత్రం వెళ్లొద్దని హెచ్చరించారు.