అల వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ తరువాత అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్క. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ రఫ్‌ లుక్‌లో కనిపించనున్నాడు. ఇటీవల అల్లు అర్జున్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ లోగోతో పాటు ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అందులో బన్నీ లుక్‌ చూసిన ఫ్యాన్స్‌ షాక్‌ అయ్యారు. ఫుల్ మాస్ లుక్‌లో డిఫరెంట్ మేకోవర్‌లో ఉన్న బన్నీ అభిమానులను సర్‌ప్రైజ్‌ చేశాడు.

అంతేకాదు ఈ సినిమా పాన్‌ ఇండియా లెవల్‌లో రూపొందిస్తున్నట్టుగా ప్రకటించారు. అందుకు తగ్గట్టుగా ఐదు భాషల్లో ఫస్ట్ లుక్‌ పోస్టర్ ను రిలీజ్‌ చేశారు. నటీ నటుల ఎంపికలోనూ అన్ని భాషల నటులు ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. సినిమా ప్రారంభమైన సమయంలోనే ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడన్ని ప్రకటించారు.

అయితే తాజా సమాచారం ప్రకారం విజయ్‌ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడట. లాక్ డౌన్‌ కారణంగా దాదాపు 20 రోజులుగా షూటింగ్ లు ఆగిపోయాయి. తిరిగి ఎప్పుడు ప్రారంభమయ్యేది ఇంకా డిసైడ్ కాలేదు. దీంతో విజయ్‌ సేతుపతి లాంటి బిజీ ఆర్టిస్ట్‌ లకు డేట్స్ సమస్య తలెత్తుంది. ఒకేసారి నాలుగైదు సినిమాల్లో నటించే విజయ్‌ సేతుపతి, ఏ మాత్రం గ్యాప్ వచ్చినా ఇతర చిత్రాలతో డేట్స్‌ క్లాష్ వస్తుంది. ఆ కారణంగానే పుష్ప నుంచి కూడా విజయ్ తప్పుకుంటున్నాడట.

దీంతో ఆ పాత్రకు బాబీ సింహను తీసుకునే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్‌. ఇక ఈ సినిమాలో విలన్‌గా ఓ బాలీవుడ్ స్టార్ నటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. హిందీలో కూడా భారీగా రిలీజ్ చేయాలని భావిస్తున్న ఈ సినిమాలో విలన్‌గా సంజయ్ దత్‌ లేదా సునీల్ శెట్టిలలో ఒకరిని తీసుకునే ఆలోచనలో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది.